కెనడాలో( Canada ) భారత వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తూ ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడానికి కారణమైన ఖలిస్తానీలకు అక్కడి కోర్ట్ షాకిచ్చింది.ఈ నెలలో వాంకోవర్‌లో( Vancouver ) భారత కాన్సులేట్ నిర్వహించనున్న కాన్సులర్ శిబిరాలకు ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాదులు అంతరాయం కలిగించడకుండా భద్రతా చర్యలు చేపట్టాలని స్థానిక పోలీస్ శాఖను ఆదేశించింది.
కెనడియన్ గురుద్వారా చేసిన అభ్యర్ధన ఆధారంగా నిషేధాన్ని మంజూరు చేసింది.
వాంకోవర్‌లోని చారిత్రాత్మక ఖల్సా దివాన్ సొసైటీ గురుద్వారా( Khalsa Diwan Society Gurdwara ) దాఖలు చేసిన పిటిషన్‌పై బ్రిటీష్ కొలంబియా సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి ఈ నిషేధాన్ని మంజూరు చేశారు.రాస్ స్ట్రీట్ గురుద్వారాగా ఈ ఆధ్యాత్మిక కేంద్రం ప్రసిద్ధి చెందింది.నవంబర్ 2 నుంచి 16వ తేదీల మధ్య జరగనున్న కాన్సులర్ క్యాంప్‌ల సమయంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు వాంకోవర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చర్యలు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది.
కెనడాలోని అన్ని భారతీయ కాన్సులర్ కార్యాలయాలు మూసివేయాలని ఖలిస్తాన్ వేర్పాటువాదులు నిరసనలకు దిగుతుండటంతో కాన్సులర్ అధికారులు గురుద్వారాలలో క్యాంప్‌లు పెడుతున్నారు.ఖలిస్తానీయులను అడుగుపెట్టకుండా చూసేందుకు గాను గురుద్వారా ఈ చర్యలకు దిగినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.గతేడాది కాన్సులర్ క్యాంప్‌లు నిర్వహించినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని సొసైటీ అధ్యక్షుడు కులదీప్ సింగ్ తాండి తెలిపారు.కోర్టు ఆదేశాల మేరకు గురుద్వారాకు 50 మీటర్ల వరకు నిరసనకారులు రాకుండా పోలీసులు భద్రత కల్పించనున్నారు.
కెనడాలో నివాసం ఉంటున్న పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్లు వంటి సేవలను అందించడానికి ప్రతియేటా కాన్సులర్ క్యాంప్‌లు నిర్వహిస్తారు.పెన్షన్ ప్రయోజనాల కోసం సర్టిఫికెట్లు ఉచితంగా అందిస్తారు.
భారత్ – కెనడాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాజా కాన్సులర్ క్యాంప్‌లకు అంతరాయం కలిగించడానికి ఖలిస్తాన్ మద్ధతుదారులు యత్నిస్తారని కొన్ని వర్గాలు భయపడుతున్నాయి.ఒట్టావాలోని భారత హైకమీషన్‌తో పాటు టొరంటో, వాంకోవర్‌లలోని భారతీయ కాన్సులేట్‌లు, అంటారియో, క్యూబెక్, మానిటోబా, సస్కట్చేవాన్, అల్బెర్టా, నోవాస్కోటియా ప్రావిన్సులలో ఇందుకోసం వేదికలను సిద్ధం చేసింది భారత విదేశాంగ శాఖ.వీటిలో గురుద్వారాలు, హిందూ దేవాలయాలు ఉన్నాయి.