శనగ పంట( Bengal Gram Cultivation ) ప్రధాన పప్పు ధాన్యాల పంటలలో ఒకటి.నల్ల రేగడి నేలలలో రబీలో అధిక విస్తీర్ణంలో సాగు అయ్యే పంటగా శనగ పంటను చెప్పుకోవచ్చు.
అక్టోబర్ నుండి నవంబర్ వరకు శనగ పంటను విత్తుకోవచ్చు.శనగ పంట మంచు ఆధారంగా పండే పంట కాబట్టి నీటి అవసరం చాలా అంటే చాలా తక్కువ.
కేవలం పూత, పిందె దశలో ఉన్నప్పుడు నీటిని అందిస్తే సరిపోతుంది.శనగ పంట సాగుకు చౌడు నేలలు, నీరు నిల్వ ఉండే నేలలు తప్ప మిగిలిన అన్ని రకాల నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.
వేసవికాలంలో నేలను లోతు దుక్కులు దున్ని, ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల భాస్వరం, 10 కిలోల నత్రజని వేసి కలియ దున్నుకోవాలి.
ఒక ఎకరాకు 30 కిలోల విత్తనాలు( Seeds ) అవసరం.ఒక కిలో విత్తనాలకు 8 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి లేదంటే 2.5 గ్రాముల తైరం తో విత్తన శుద్ధి చేసుకోవాలి.ఇక విత్తనం విత్తుకోవాడంలో ఆలస్యం చేయకూడదు.ఒకవేళ ఆలస్యం అయితే అధిక ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో పూత రాలిపోయే అవకాశం చాలా ఎక్కువ.కాబట్టి నవంబర్ చివరిలోపు విత్తుకోవాలి.విత్తనాలు విత్తేటప్పుడు కచ్చితంగా నేలలో తేమ ఉండేలా చూసుకోవాలి.
శనగ పంటకు తెగుళ్ల బెడద కంటే చీడపీడల బెడద( Weeds ) కాస్త ఎక్కువ.పచ్చ రబ్బరు పురుగులు పంటను ఆశిస్తే ఊహించని నష్టం ఎదుర్కోవాల్సిందే.ఎందుకంటే ఈ పురుగులు గుంపులు గుంపులుగా చేరి ఆకులు తినడం వల్ల ఆకులు జల్లెడలాగా మారి దిగుబడి తగ్గుతుంది.ఈ పురుగులను పొలంలో గుర్తించిన తర్వాత ఒక లీటరు నీటిలో రెండు గ్రాముల తయోడికార్బ్ లేదంటే ఒక మిల్లీ లీటరు ఇండాక్సకార్బ్ ను కలిపి పిచికారి చేయాలి.
శనగ పంట కాస్త తక్కువ శ్రమతో కూడుకున్నది కానీ పంటను చీడపీడల, తెగుళ్ల బెడద నుండి సంరక్షించుకుంటే చాలు ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందవచ్చు.