గత కొద్దిరోజులుగా ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ మద్ధతుదారులు వీరంగం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.హిందూ దేవాలయాలను టార్గెట్ చేసి వాటిపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలు, భారత వ్యతిరేక రాతలను రాస్తున్నారు.
ఇది మరింత తీవ్రస్థాయికి చేరుకుని ఏకంగా తోటి భారతీయులపైనే ఖలిస్తాన్ మద్ధతుదారులు దాడికి పాల్పడ్డారు.భారత జాతీయ పతాకాలను పట్టుకున్న వారిని చితకబాదడంతో పాటు కత్తులతో బెదిరించారు.
మన జెండా కర్రల్ని ధ్వంసం చేశారు.ఈ చర్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
తాజాగా ఖలిస్తాన్ మద్ధతుదారులు మరింత రెచ్చిపోయారు ఏకంగా బ్రిస్బేన్‌లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు.నగరంలోని టారింగా శివారులోని స్వాన్ రోడ్‌లో వున్న భారత కాన్సులేట్‌ను ఫిబ్రవరి 21 రాత్రి ఖలిస్తాన్ మద్ధతుదారులు లక్ష్యంగా చేసుకున్నారని ఆస్ట్రేలియా టుడే వార్తా సంస్థ నివేదించింది.
భారత కాన్సులేట్ జనరల్ అర్చనా సింగ్ ఫిబ్రవరి 22న కార్యాలయానికి వచ్చిరాగానే ఖలిస్తాన్ జెండా చూసి షాక్‌కు గురయ్యారు.
దీంతో ఆమె వెంటనే ఈ విషయంపై క్వీన్స్‌లాండ్ పోలీసులకు సమాచారం అందించారు.కాన్సులేట్ కార్యాలయానికి చేరుకున్న వెంటనే వారు జెండాను స్వాధీనం చేసుకున్నారు.దీనిపై కాన్సులర్ జనరల్ అర్చనా సింగ్ మీడియాతో మాట్లాడుతూ.
తమను సురక్షితంగా వుంచడానికి పోలీసులు ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.పోలీసులపై తమకు నమ్మకం వుందని ఆమె అన్నారు.
కాగా.గతవారం ఆస్ట్రేలియాలోని పరిస్ధితుల నేపథ్యంలో అక్కడి భారత హైకమీషన్ స్పందించింది.ఖలిస్తాన్ అనుకూల శక్తులు ఆస్ట్రేలియాలో తమ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయని ఓ ప్రకటనలో తెలిపింది.నిషేధిత ఉగ్రవాద సంస్థలైన సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) సహా ఇతర వేర్పాటువాద సంస్థలు చురుకుగా పనిచేస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని హైకమీషన్ పేర్కొంది.
భారతదేశ సమగ్రత, భద్రత, జాతి ప్రయోజనాలకు హాని కలిగించే కార్యకలాపాల కోసం ఆస్ట్రేలియన్ భూభాగాన్ని ఉపయోగించడాన్ని అనుమతించకూడదని ఆ దేశ ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపింది.