దేశ రాజధాని ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ( Hauz Khas in Delhi )ప్రాంతంలో అనాథ కుక్కల కోసం ఏర్పాటు చేసిన ఆశ్రయాన్ని ఓ విదేశీ మహిళ ధ్వంసం చేయడం పెద్ద దుమారం రేపింది.రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ( Kiran Bedi ) ఆ మహిళకు మద్దతు పలకడం ఇప్పుడు జంతు ప్రేమికుల ఆగ్రహానికి కారణమైంది.
చలి నుంచి రక్షించేందుకు ఏర్పాటు చేసిన వెచ్చని దుస్తులతో సహా ఆశ్రయాన్ని ఆ మహిళ తొలగించింది.
లీలాగా గుర్తించబడిన ఆ విదేశీ మహిళ ఆశ్రయాన్ని పీకి పారేసి, దుస్తులను మూటగట్టి విసిరిపారేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తన పెంపుడు కుక్కతో నడుస్తుండగా వీధి కుక్కలు దాడి చేయడంతోనే లీలా అలా చేసిందని కిరణ్ బేడీ సమర్థించచే ప్రయత్నం చేశారు.కానీ, బేడీ ఇచ్చిన ఈ వివరణ నెటిజన్లకు మరింత ఆగ్రహం తెప్పించింది.
కిరణ్ బేడీ ప్రోద్బలంతోనే ఆశ్రయాన్ని తొలగించారని, వీధి కుక్కలకు ఆహారం అందిస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారని సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి.ఇంతకుముందు కూడా బేడీ తన నివాసం సమీపంలో ఉన్న వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు మరికొందరు గుర్తు చేస్తున్నారు.అయితే, జంతు ప్రేమికుడు ఆశిష్ శర్మ ( Ashish Sharma )వెంటనే స్పందించి, కూల్చివేసిన ఆశ్రమాన్ని అదే రోజు తిరిగి నిర్మించారు.ఢిల్లీలో చలి తీవ్రంగా ఉన్న సమయంలో కుక్కలను రక్షించేందుకు ఏర్పాటు చేసిన ఆశ్రయాన్ని తొలగించడంపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కుక్కలు దాడి చేస్తే లీలా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది పోయి, తన చేతుల్లోకి తీసుకోవడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.
లీలా చేసింది బుద్ధి తక్కువ పని అని, ఆ పనిని సమర్థిస్తూ కిరణ్ బేడీ మాట్లాడటం అన్యాయమని, దారుణమని చాలామంది విమర్శిస్తున్నారు.వీధి జంతువులను సంరక్షించేవారికి చట్టాలు అండగా ఉంటాయని, ఆశ్రయాలను ధ్వంసం చేసేందుకు లేదా వాటికి ఆహారం వేసేవారిని బెదిరించేందుకు ఎవరికీ హక్కు లేదని వారు గుర్తు చేస్తున్నారు.ఇదిలా ఉండగా, కిరణ్ బేడీకి వీధి కుక్కల పట్ల ఉన్న వ్యతిరేకత కొత్తేమీ కాదని పలువురు గుర్తు చేస్తున్నారు.2016లో పుదుచ్చేరిలో వీధి కుక్కలను పౌండ్లకు తరలించాలని ఆమె ప్రతిపాదించారు.2022లో కుక్కలను నడిపించే విషయంలోనూ ఆమె వివాదంలో చిక్కుకున్నారు.మొత్తానికి కిరణ్ బేడీ తీరుపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆమెను “కుక్కలను ద్వేషించే వ్యక్తి”గా అభివర్ణిస్తూ, లీలా చర్యలను ఆమె సమర్థించడాన్ని తప్పుబడుతున్నారు.