ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది.పథకాల పేరుతో ఖర్చులు ఎక్కువ కావడం.
వచ్చే ఆదాయం దారుణంగా పడిపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.ముఖ్యంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, పెట్రోలియం ఉత్పత్తులపై ఆదాయం భారీగా పతనమైంది.ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పన్నుల ద్వారా రూ.3228 కోట్లు వచ్చాయి.గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ మొత్తం రూ.3521 కోట్లుగా ఉంది.

ఇదే సమయంలో జీతాలు, రైతు భరోసా-పీఎం కిసాన్ పథకానికి డబ్బులు చెల్లించాల్సి రావడంతో ఖజానా పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి దాపురించింది.ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం ఏపీ ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఉన్నాయి.అంటే ఇప్పుడు అదనంగా ఎలాంటి బిల్లులు చెల్లించే పరిస్థితి కనిపించడం లేదు.

పైగా ఈ నెల 21న వైఎస్‌ఆర్ మత్య్సకార నేస్తం పథకం ప్రారంభించబోతున్నారు.దీనికోసం కనీసం రూ.200 కోట్లు కావాలి.అంటే ఈ పథకం అమలు కోసం సరిపడా డబ్బులు కూడా ప్రస్తుతం ఖజానాలో లేవు.ప్రతి నెల కేంద్రం నుంచి సెంట్రల్ ఎక్సైజ్, ఐటీ, కస్టమ్స్‌లాంటి పన్నుల రూపంలో వచ్చే రూ.2 వేల కోట్ల కోసం ఇప్పుడు జగన్ సర్కార్ ఆశగా ఎదురు చూస్తోంది.దీనికితోడు రాష్ట్రానికి ప్రతి వారం జీఎస్టీ కింది రూ.400 కోట్ల వరకు వస్తాయి.
ఈ మొత్తం వస్తేనే మత్స్యకార నేస్తం పథకం సజావుగా అమలు చేయగలుగుతామని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.ఈ పథకం తర్వాత వైఎస్సార్ కంటి వెలుగు పథకం కూడా ప్రారంభించాల్సి ఉంది.మత్స్యకార నేస్తం పథకం కింద చేపలు పట్టలేని సమయంలో రాష్ట్రంలోని లక్షా 32 వేల మంది మత్స్యకారులు ఒక్కొక్కరికి రూ.10 వేలు చెల్లించనుంది.