ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ( Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది.
ఇప్పటికే ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించగా.కెనడాలోని వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని భారత్ మూసివేసింది.
ఇరుదేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.అయితే భారత్ వీసాలను నిలిపివేయడంతో అత్యవసర పనుల నిమిత్తం మనదేశానికి రావాల్సిన కెనడియన్లు, ప్రవాస భారతీయులు , వ్యాపారవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీనిపై భారీగా ఫిర్యాదులు సైతం రావడంతో కేంద్ర విదేశాంగ శాఖ , కెనడాలోని ఇండియన్ హైకమీషన్ స్పందించింది.కెనడాలో( Canada ) నిలిపివేసిన అన్ని రకాల వీసా సేవలను అక్టోబర్ 26 నుంచి పున: ప్రారంభించనున్నట్లుగా తెలిపింది.
భారతీయ దౌత్యవేత్తల భద్రతతో పాటు కొన్ని చర్యలకు కెనడా ప్రభుత్వం హామీ ఇవ్వడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్( External Affairs Minister S Jaishankar ) ఆదివారం ఒక సెమినార్‌లో మాట్లాడుతూ.భారతీయ దౌత్యవేత్తలకు కెనడాలో ఎలాంటి ప్రమాదం జరగదని తాము విశ్వసిస్తే వీసా సేవలను తిరిగి పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.ప్రవేశం, వ్యాపారం, వైద్యం, ముఖ్యమైన సమావేశాలకు సంబంధించిన వీసాలకు తొలుత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం వుంది.
ఏది ఏమైనప్పటికీ.భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో 41 మంది కెనడా దౌత్యవేత్తలు జోక్యం చేసుకున్నారని , అందుకే వారిని బహిష్కరించినట్లుగా జైశంకర్ ఆరోపిస్తున్నారు.ఈ విషయంలో ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.అతి త్వరలోనే రెండు దేశాల వైపు వీసా ( Visa ) జారీ ప్రక్రియ విషయంలో సాధారణ పరిస్ధితులు నెలకొంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు కొన్ని రకాల వీసా సేవలను పునరుద్ధరిస్తూ భారత్( India ) తీసుకున్న నిర్ణయాన్ని కెనడా స్వాగతించింది.కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్( Canada Immigration Minister Marc Miller ) మీడియాతో మాట్లాడుతూ.
భారత్ చర్య చాలా మంచి సంకేతమని వ్యాఖ్యానించారు.వివాహాలు, అంత్యక్రియలు తదితర అత్యవసర కార్యక్రమాలకు సంబంధించి రాకపోకలు సాగించడం కీలకమని మిల్లర్ తెలిపారు.