తెలంగాణలో ఇవాళ మద్యం టెండర్లకు లక్కీ డ్రా తీయనున్నారు.లక్కీ డ్రా ద్వారా వైన్ షాపులను కేటాయించేందుకు ఎక్సైజ్ శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
లక్కీ డ్రాలో మొత్తం 2,620 వైన్ షాపులకు ఎక్సైజ్ శాఖ డ్రా నిర్వహించనుండగా అదృష్టం ఎవరినీ వరిస్తుందో అన్న విషయంపై దరఖాస్తు దారుల్లో ఆసక్తి నెలకొంది.కాగా 2023-25 మద్యం పాలసీకి సంబంధించి కొత్త షాపుల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ మేరకు ఈనెల 4న టెండర్లకు దరఖాస్తులు ప్రారంభం కాగా 18వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే.అయితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 31 వేల 490 దరఖాస్తులు వచ్చాయి.
వీటిలో అత్యధికంగా సరూర్ నగర్ లో 10,908 దరఖాస్తులు, అత్యల్పంగా ఆసిఫాబాద్ లో 967 టెండర్లకు దరఖాస్తులు వచ్చాయి.కాగా ఈ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరింది.