ఒకవైపు సార్వత్రిక సమయం దగ్గర పడుతూ ఉండడంతో, తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ టెన్షన్ పడుతోంది.మరోవైపు చూస్తే కేంద్ర అధికార పార్టీ బిజెపి తమను టార్గెట్ చేసుకుంటూ అనేక రకాలుగా వేధింపులకు దిగుతోంది.
ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కాం లో బయటపడడంతో, దర్యాప్తు సంస్థలు ఆమెను అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది.ఈ వ్యవహారం ఇలా ఉండగానే బీఆర్ఎస్ లోని కీలక నేతలు చాలామంది పార్టీలోను, ప్రభుత్వంలోనూ తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని, కెసిఆర్ తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఇతర పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇప్పటికే అనేకమంది కీలక నాయకులు బిజెపి వంటి పార్టీలు చేరిపోగా, మరికొందరు సొంత పార్టీ పెట్టే ఆలోనలో ఉన్నారు.
తాజాగా వనపర్తి బీఆర్ఎస్ లో కలకలం రేగింది.జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవహారశైలి కారణంగా రాజీనామా చేస్తున్నట్లు లోక్ నాథ్ రెడ్డి చెబుతున్నారు.
ఆయనతోపాటు వనపర్తి ఎంపీపీ కి, పెద్ద మందడి ఎంపీపీ మేఘా రెడ్డి, సర్పంచ్ లు, మాజీ ఎంపీపీలు, మాజీ సింగిల్ విండో చైర్మన్ లు రాజీనామా చేయబోతున్నారు.వీరంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు .లోక్నాథ్ రెడ్డి మంత్రి నిరంజన్ రెడ్డితో కొంతకాలంగా విభేదిస్తున్నారు.జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి బీఆర్ఎస్ లో తమకు సరైన ప్రాధాన్యం లేకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఆత్మగౌరవాన్ని చంపుకోలేక , అవమానాలు భరించలేకనే రాజీనామా చేస్తున్నామని, ప్రజల కోసం పోరాటం చేస్తామని లోకనాథ్ రెడ్డి వర్గం చెబుతోంది.అయితే పార్టీకి రాజీనామా చేయబోతున్న వీరంతా ఏ పార్టీలో చేరబోతున్నారు ? వీరి రాజకీయ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయంలో సందిగ్ధం నెలకొంది.ఇది ఎలా ఉంటే ఈ వ్యవహారాలపై బిఆర్ఎఫ్ అధిష్టానం కూడా ఆరా తీస్తోంది.ఎవరు పార్టీని వీడి వెళ్ళకుండా జాగ్రత్తలు చేపడుతూ, వారిని బుజ్జగించే ప్రయత్నం మొదలుపెట్టినట్లు సమాచారం.