సాధారణంగా దేశంలో ఏదైనా ఆహార పదార్థం ఎక్కువగా అందుబాటులో లేనట్లయితే దాని ధర ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది.డిమాండ్, సప్లై సమానంగా ఉంటేనే ధరల భారం ప్రజలపై ఉండదు.
అయితే ప్రస్తుతం మన దేశంలో గోధుమలు, గోధుమ పిండి కొరత ఏర్పడింది.దీనివల్ల వీటి ధరలు పెరుగుతున్నాయి.
వీటి ధరల పెరుగుదలకు కళ్లెం వేసేందుకు రాబోయే రెండు నెలల్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ద్వారా 30 లక్షల టన్నుల గోధుమలను ఓపెన్ మార్కెట్‌లో విడుదల చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ నిర్ణయాన్ని రోలర్ ఫ్లోర్ మిల్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (RFMFI) స్వాగతించింది.
గోధుమల ధరలు కిలోకు 5-6 రూపాయల వరకు తగ్గుతాయని అంచనా వేసింది.ప్రభుత్వం వచ్చే రెండు నెలలలో ఈ-వేలం ద్వారా పిండి మిల్లర్లు వంటి భారీ వినియోగదారులకు గోధుమలను విక్రయిస్తుంది.
ఎఫ్‌సీఐ కూడా ధాన్యాన్ని ఆటాగా మార్చడానికి, ప్రజలకు అందించడానికి ప్రభుత్వ రంగ యూనిట్లు, సహకార సంఘాలు, సమాఖ్యలకు కిలో గోధుమలను రూ.23.50 చొప్పున విక్రయించనుంది.అప్పుడు గోధుమల కిలో గరిష్ట రిటైల్ ధర రూ.29.50కి తగ్గుతుంది.ధర అనేది అంతకంటే ఎక్కువ పెరగదు.ఇకపోతే పొరుగున ఉన్న పాకిస్థాన్ గోధుమలు, పిండి కొరత, పెరుగుతున్న ధరల కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
పాకిస్థాన్ గోధుమలను ఎక్కువ భాగం రష్యా, ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది కానీ ఇప్పుడు ఆ రెండు దేశాలు యుద్ధంలో నిమగ్నమయ్యాయి.కాబట్టి దిగుమతులు బాగా తగ్గాయి.దాంతో ఇక్కడ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.మరోవైపు ప్రపంచంలోని రెండవ అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు అయిన భారతదేశం ఎన్నడూ ప్రధాన గోధుమ ఎగుమతి దేశంగా నిలవలేదు.ఇతర దేశాల నుంచి ఇండియా దిగుమతులు కూడా చేసుకోదు.అలా మన దేశం చాలా వరకు స్వయం సమృద్ధి సాధించింది.