ప్రస్తుతం ఎక్కడ చూసినా నగదు చలామణీ నానాటికీ తగ్గిపోతుంది.చిన్న టీ షాపు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వరకు అన్నింటా డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయి.
చకచకా యూపీఐ ఆధారిత యాప్‌లు ఓపెన్ చేసి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేస్తున్నారు.ఇలా డిజిటల్ చెల్లింపులపై ఆధారపడడంతో ఆన్లైన్ మోసాల కేసులు పెరుగుతున్నాయి.
స్కామర్లు వినియోగదారులను మోసగించే అత్యంత సాధారణ మార్గాలలో QR కోడ్ల ద్వారా చెల్లింపులు కూడా ఒకటి.QR కోడ్ స్కామ్‌లు వేగంగా పెరుగుతున్నాయి.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఇటీవల కాలంలో సైబర్ మోసాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. క్యూఆర్ కోడ్ స్కానింగ్‌ను సైబర్ నేరగాళ్లు ఎంచుకుంటున్నారు.దుకాణాలలో క్యూఆర్ కోడ్‌ను మార్చి పెడుతున్నారు.
ఒక్కోసారి అవి స్కాన్ చేసి చెల్లింపులు చేస్తే, మన ఖాతాలోని డబ్బులన్నీ మాయం అవుతున్నాయి.అంతేకాకుండా మన ఫోన్లలోని ఫొటోలు, మెసేజ్‌లు ఇతర రహస్య సమాచారం అంతా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతోంది.
వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.అందినకాడికి బాధితుల వద్ద గుంజుతున్నారు.
కొన్ని సార్లు ఆన్లైన్లో ఏవైనా చెల్లింపులు చేయాల్సి వచ్చినప్పుడు స్కామర్లు లొకేషన్, UPI ID లేదా పేమెంట్ ID లేదా బ్యాంక్ ఖాతా వివరాలను పంపమని అడుగుతున్నారు.కొందరు మాత్రం తెలియక UPI IDని పంపుతున్నారు.
తిరిగి స్కామర్లు వాట్సాప్‌లో క్యూఆర్ కోడ్‌ను పంపుతున్నారు.గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా క్యూార్ కోడ్ స్కాన్ చేయమని స్కామర్లు రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఏ మాత్రం అమాయకంగా వారు చెప్పినట్లు చేయగా ఖాతాలో డబ్బు మొత్తం చోరీ చేస్తున్నారు.పర్సనల్ సమాచారం కూడా వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది కాబట్టి మన జుట్టు వారి చేతుల్లో ఉన్నట్లే.
కొన్ని సందర్భాల్లో షాపులలో, రెస్టారెంట్లలో క్యూఆర్ కోడ్లను మార్చి పెడుతున్నారు.ఆ విధంగా కూడా స్కామ్‌లు జరుగుతున్నాయి.
దీనిపై అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులను బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి.