కళలకు, గొప్ప సంస్కృతికి, ప్రకృతి వనరులకు, అపార సంపదకు పుట్టినిల్లు భారతదేశం.అందుకే అనాదిగా ఈ రత్న గర్భ విదేశీ దండయాత్రలను ఎదుర్కొంది.
నాటి అలెగ్జాండర్ నుంచి ఆంగ్లేయుల వరకు భారతదేశాన్ని కొల్లగొట్టిన వారే.దేశాన్ని చెప్పు చేతల్లోకి తీసుకోవడంతో పాటు ఇక్కడి సంపదను వారి స్వదేశాలకు తరలించుకుపోయారు.
వాటిలో కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం తో పాటు ఎన్నో కళాఖండాలు, ముత్యాలు, పగడాలు, వజ్ర వైడూర్యాలు వున్నాయి.ఇక స్వాతంత్ర్యం వచ్చాకా స్వదేశంలోని దొంగల వల్ల మనదేశ సంపద ఖండాలు దాటుతోంది.
కోట్లాది రూపాయల డబ్బుకు ఆశపడి కొందరు భారతీయులే దేవాలయాల్లోని సంపదను కొల్లగొట్టి విదేశాలకు విక్రయిస్తున్నారు.అలా భారతీయ సంపద.
విదేశాల్లోని ఆర్ట్ గ్యాలరీల్లో, మ్యూజియాల్లో మగ్గుతోంది.అయితే కొందరి కృషి వల్ల అలాంటి అపురూప సంపద తిరిగి భారతదేశానికి చేరుకుంటోంది.
తాజాగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వానికి అమెరికా శుభవార్త చెప్పింది.500 ఏళ్ల నాటి పురాతన హనుమాన్ విగ్రహాన్ని భారతదేశానికి అప్పగిస్తామని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు.బుధవారం వాషింగ్టన్‌లోని బెంజిమన్ ఫ్రాంక్లిన్ రూమ్‌లో దీపావళి వేడుకలను అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘనంగా నిర్వహించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్లింకెన్ .జ్యోతి ప్రజ్వలన చేసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… వివిధ దేశాల సంస్కృతిని , చారిత్రక సంపదను కాపాడేందుకు అమెరికా ఎప్పుడూ సహకరిస్తుందన్నారు.
దీనిలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలోని అమెరికా రాయబార కార్యాలయం, అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్, భారతీయ దర్యాప్తు ఏజెన్సీలు కలిసి 500 ఏళ్ల పురాతనమైన హనుమాన్ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బ్లింకెన్ తెలిపారు.
ఇంతకీ ఎక్కడిదా హనుమాన్ విగ్రహం… ఆస్ట్రేలియాకు ఎలా చేరింది :
దక్షిణ భారతదేశంలోని ఓ ఆలయంలోంచి 500 ఏళ్ల నాటి ఈ హనుమాన్ విగ్రహాన్ని కొందరు దొంగిలించారు.అనంతరం దానిని ఖండాలు దాటించి అమెరికాలోని క్రిస్టీ ఆక్షన్ హౌస్‌కు విక్రయించారు.దీనిని వేలానికి పెట్టగా.
ఒక ఆస్ట్రేలియా పౌరుడు కొనుగోలు చేశాడు.కానీ ఇది భారత్‌లో దొంగిలించబడిన విషయం ఆక్షన్ సంస్థకు కానీ, వేలంలో కొనుక్కున్న ఆస్ట్రేలియా పౌరుడికి కానీ తెలియదు.
అయితే భారత ప్రభుత్వం నుంచి సమాచారం అందడంతో విగ్రహాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇండియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలకు సహకరించినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.