కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు దేవుళ్ళను సైతం మర్చిపోయి తమకు కరోనా సమయంలో సేవలను అందించిన వైద్యులు, నర్సులే తమ దేవుళ్ళని చేతులెత్తి మొక్కని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు.ఎంతో విపత్కర సమయంలో వైద్యులు, నర్సులు అందించిన సేవలు ఎప్పటికి మర్చిపోలేం.
ముఖ్యంగా కరోనా విరుచుకుపడుతున్న సమయంలో కరోనా రోగులకు నర్సులు అందించిన సేవలు వెలకట్టలేనివి.రోగులకు సేవలు చేస్తున్న క్రమంలో ఎంతో మంది నర్సులు తమ ప్రాణాలను కూడా కోల్పోయారు.
దేశ విదేశాలలో అత్యధికంగా నర్సింగ్ రంగంలో సేవలు అందిస్తోంది మన భారతీయ నర్సులు కావడం గమనార్హం.ముఖ్యంగా
భారత్ లోని కేరళ నుంచీ నర్సులు అత్యధికంగా విదేశాలలో నర్సింగ్ సేవలు అందించేందుకు వలసలు వెళ్తుంటారు.
ఆ తరువాత తెలుగు రాష్ట్రాల నుంచీ వెళ్ళే వారి సంఖ్య ఎక్కువ.కరోనా సమయంలో అత్యుత్తమమైన సేవలు అందించినందుకు గాను ఎంతో మంది సత్కరించబడ్డారు, గౌరవించుకోబడ్డారు అయితే తాజాగా సౌదీ అరేబియా లోని నర్సింగ్ స్కాలర్ సొసైటీ కూడా కరోనా సమయంలో సేవలు అందించిన నర్సులను సత్కరించుకోవాలని భావించింది.
ఈ క్రమంలోనే రియాద్ నగరంలో ఏర్పాటు చేసిన కోవిడ్ రోగుల ప్రత్యేక ఆసుపత్రికి చెందిన నల్గొండ వాసి అయిన బొజ్జ అనిల్ కుమార్ ను ప్రెసిడెన్షియల్ మెంబర్ షిప్ సభ్యత్వం ఇచ్చి సత్కరించుకుంది.బొజ్జ అనిల్ ప్రస్తుతం సౌదీలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నారు.ఇదిలాఉంటే
సౌదీలోని రియాద్ నగరంలోనే మరొక ఆసుపత్రిలో ఏపీలోని కడపకు చెందిన లక్షి అనే నర్సు షిఫ్ట్ ఇంచార్జ్ గా సేవలు అందిస్తున్నారు.అత్యవసర కేసులను డీల్ చేయడంలో ఆమె చూపే చొరవ అద్భుతమని కరోనా సమయంలో ఆమె అత్యుత్తమైన ప్రతిభ కనబరిచారని ఆమె సేవలను కొనియాడింది నర్సింగ్ స్కాలర్ సొసైటీ.
అలాగే తిరుపతికి చెందిన మరో మహిళను, హైదరాబాద్ కి చెందిన అరుణ అనే నర్సుల సేవలను కొనియాడింది నర్సింగ్ స్కాలర్ సొసైటీ.ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భారతీయ నర్సులు కరోనా సమయంలో సేవలు అందించారని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది సదరు సంస్థ.