యాదాద్రి జిల్లా:భువనగిరి మోడల్ మార్కెట్ ప్రారంభోత్సవం సందర్భంగా అధికార పార్టీ నేతల మధ్య ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు కాస్త బహిరంగ ఆరోపణల వరకు రావడంతో పార్టీ శ్రేణులు అవాక్కయ్యారు.భువనగిరి జిల్లా కేంద్రంలో రూ.1.56 లక్షల వ్యయంతో నిర్మించిన రైతుబజార్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన జెడ్పి చైర్ పర్సన్ ఏలిమినేటి సందీప్ రెడ్డి మాట్లాడుతూ రైతుబజార్ కు రూ.2 కోట్ల నిధులు కేటాయించి, శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావును, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని,కనీసం జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిని కూడా ఓపెనింగ్ కు ఆహ్వానించకుండా ఇలా ఏకపక్షంగా హడావుడిగా రైతుబజార్ ను ఎందుకు ప్రారంభిస్తున్నారో? ఏ ఉదేశ్యంతో చేస్తున్నారో? అర్ధం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.రైతుబజార్ ఓపెనింగ్ విషయంలో ఒంటరి పోకడలు పోవడంపట్ల చాలా బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంలో స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ దే బాధ్యత అంటూ మందలించారు.
ఈ ప్రాంతంలో మొదట రైతుబజార్ ను శంకుస్థాపన చేసిన వ్యక్తి ఏలిమినేటి మాధవరెడ్డి అని,ఆయన ఫోటోను వాడకుండా,తన ఫోటో కూడా చిన్నగా వేయడం సరికాదని ఫైర్ అయ్యారు.ఇదంతా చూస్తుంటే జెడ్పి చైర్ పర్సన్ సందీప్ రెడ్డి టార్గెట్ చేసింది మార్కెట్ కమిటీ చైర్మన్ ను కాదనేది అందరికీ అర్థమవుతున్నా తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు.
జెడ్పి చైర్ పర్సన్ రైతుబజార్ ఓపెనింగ్ లో అంత ఓపెన్ గా మాట్లాడంతో ఇన్నాళ్లు టీఆర్ఎస్ లో అంతర్గతంగా నడుస్తున్న వర్గపోరు బహిర్గతం అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ మధ్య రాష్ట్రంలో అంతా ప్రోటో కాల్,ఫోటోల పంచాయితీ నడుస్తున్న నేపథ్యంలో భువనగిరిలో కూడా అక్కడే లొల్లి మొదలు కావడం గమనార్హం.
మోడల్ మార్కెట్ ఓపెనింగ్ లో ఓపెన్ అయిన వర్గపోరు ఇంతటితో ఆగుతుందా లేదా చూడాలి మరి!ఇదిలా ఉంటే సందట్లో సడేమియా అన్నట్లు ఈ కార్యక్రమంలో ప్రెస్ కోసం కేటాయించిన గ్యాలరీని సైతం టీఆర్ఎస్ నాయకులు అక్రమించుకోవడంతో చేసేదేమీ లేక జర్నలిస్టులు పక్కపొంటి నిల్చోని రాసుకుంటూ,కవర్ చేసుకోడానికి కష్టాలు పడడం కొసమెరుపు.