దేశం కాని దేశంలో ఉపాది కోసం వెళ్ళిన ప్రవాసులు ఆయా దేశాలలో ఉద్యోగాలు సాధించి ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్న సమయంలో అక్కడి ప్రభుత్వాలు ఏవో కారణాలు చెప్పి ఉద్యోగాల నుంచీ తొలగిస్తే ప్రవాసుల ఆర్ధిక పరిస్థితులపై, కుటుంబాలపై ఎలాంటి భారం పడుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ప్రస్తుతం కువైట్ దేశం లో ఉన్న ప్రవాసుల పరిస్థితి ఇలానే ఉంది.
గల్ఫ్ దేశాలన్నిటిలో కువైట్ దేశానికి వలస వాసులు అత్యధికంగా వెళ్తుంటారు.దాంతో కువైట్ దేశం లో ఉండే స్థానిక యువతకు అక్కడ ఉపాది రంగంలో అవకాశాలు లేకపోవడంతో 2017 లోనే కువైట్ ఓ పాలసీని తీసుకువచ్చింది, ఆ పాలసీనే కువైటైజేషన్.
ఈ క్రమంలో ప్రతీ ఏటా ప్రవైటు రంగంలో పనిచేస్తున్న వలస వాసులను ఏదో ఒక కారణం ద్వారా తొలగిస్తూ వచ్చింది.తొలగించిన స్థానాలలో కువైట్ ప్రజలను నియమించుకుంటోంది.
ఇలా సుమారు 5 ఏళ్ళ నుంచీ దాదాపు 13 వేల మంది ప్రవాసులపై కువైట్ వేటు వేసిందని సివిల్ సర్వీస్ కమిషన్ తెలియజేసింది.అంతేకాదు కేవలం ప్రవైటు రంగంలోని ప్రవాసులనే కాకుండా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ప్రవాసులపై కూడా కువైట్ ప్రభుత్వం కొరడా ఘులిపించింది.
ఈ రెండు రంగాలలో పనిచేస్తున్న వారిని తొలగిస్తూ వస్తోంది.
కాగా ఐదేళ్ళ క్రితం కువైట్ లో ప్రభుత్వ రంగ సంస్థలలో సుమారు 79 వేల మంది ప్రవాసులు పనిచేసే వారని అయితే వీరి సంఖ్య అమాంతం తగ్గిపోయిందని ప్రస్తుతం వీరి సంఖ్య 66 వేలు ఉందని ప్రకటించింది.ఇలా ప్రభుత్వరంగంలో ఉద్యోగాల నుంచీ తొలగించబడిన వారిలో చాలామంది విద్య, వైద్య విభాగాల నుంచీ జరిగిందని సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.భవిష్యత్తులో మరింత మంది ప్రవాసులను తొలగించి స్థానికులకు ఉద్యోగాలు కట్టబెట్టేందుకు కువైట్ ప్రభుత్వం ప్రణాలికలు సిద్దం చేసిందని తెలుస్తోంది.
గతంలో కువైట్ ప్రజలు స్థానికంగా ఉద్యోగాలు చేసేవారు కాదు, కేవలం వ్యాపార రంగంలోనే వారి హవా ఉండేది కానీ ప్రస్తుతం కువైట్ యువత ఆలోచనల్లో మార్పు వచ్చిందని వారు కూడా వలస వాసులు చేసే ఉద్యోగాలు చేయడానికి సిద్దంగా ఉండటంతో కువైట్ ప్రభుత్వం కువైటైజేషన్ ను వేగవంతం చేసినట్టుగా అంచనా వేస్తున్నారు పరిశీలకులు.