ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ గుబులు పుట్టిస్తోంది.ఇప్పటికే పలు దేశాలలో లెక్కకు మించిన కేసులు నమోదు అవుతున్న ఈ కొత్త వేరియంట్ పై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ కొత్త వేరియంట్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడంతో భవిష్యత్తులో ఈ మహమ్మారి ఎలాంటి ప్రభావం చూపుతుందోననే ఆందోళన అందరిలో నెలకొంది.ఇప్పటికే పలు దేశాలు తమ దేశంలోకి వచ్చే వలస వాసుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
తాజాగా వలస కార్మికులకు ప్రధాన దేశం సౌదీ తమ దేశంలోకి వచ్చే వారికి కీలక సూచనలు చేసింది.
ఇప్పటికే 90 దేశాలలో శరవేగంగా వ్యాప్తి చెందిన ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోందని సౌదీ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ మేరకు సౌదీ పబ్లిక్ హెల్త్ అధారిటీ కీలక ప్రకటన విడుదల చేసింది.సౌదీ వాసులు అవసరమైతే తప్ప ఎలాంటి ప్రయాణాలు ఇతర దేశాలకు చేయవద్దని ముఖ్యంగా ఒమెక్రాన్ అధికంగా విస్తరించిన దేశాలకు ప్రయాణాలు మానుకోవాలని సూచించింది.
హై రిస్క్ దేశాలకు దాదాపు వెళ్లకపోవడం మంచిదని హెచ్చరించింది.
ఇక సౌదీ కి వచ్చే ప్రవాసులు ఎవరైనా సరే తాము సూచించే నిభందనలు పాటించేలా ఉంటేనే రావాలని తెలిపింది.గతంలో వ్యాక్సిన్ వేసుకున్నా, వేసుకోక పోయినా సరే ఐదు రోజుల పాటు సోషల్ క్వారంటైన్ లో ఉండాలని అలాంటి వారికి కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే RTPCR పరీక్షలు చేయాలని సూచించింది.మాస్క్ తప్పనిసరిగా ధరించి ఉండాలని, ఎక్కువగా రద్దీగా ఉన్న ప్రాంతాలలో తిరగరాదని, రెండు డోసుల వ్యాక్సిన్ అయిన వారు బూస్టర్ డోసు వేసుకోవాలని సూచించింది.
తాము విధించిన నిభంధనలను ప్రవాసులు తప్పకుండా పాటించాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.