ఇప్పటికే మహిళల అబార్షన్ హక్కులను తొక్కిపెట్టేలా నిషేధం విధించి సంచలనం సృష్టించిన టెక్సాస్ రాష్ట్రం మరో వివాదానికి తెరలేపింది.ట్రాన్స్‌జెండర్ మహిళలు, బాలికలు పాఠశాల క్రీడల్లో పాల్గొనకుండా నిషేధించే బిల్లును టెక్సాస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించింది.
రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ సంతకంతో ఈ బిల్లు త్వరలో చట్టంగా రూపుదిద్దుకోనుంది.గతంలో మూడు సార్లు ఈ బిల్లు కోసం ప్రయత్నించిన టెక్సాస్ .నాలుగోసారి మాత్రం తన పంతం నెగ్గించుకుంది.
32 రాష్ట్రాలలో రిపబ్లికన్ శాసనసభ్యులు ఇదే తరహాలో ట్రాన్స్‌జెండర్ బాలికలు, మహిళలు క్రీడల్లో పాల్గొనకుండా బిల్లులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.ఈ ఏడాది ఇప్పటికే ఏడు రాష్ట్రాలు ఇటువంటి చట్టాలను ఆమోదించాయి.తాజాగా టెక్సాస్ ఈ లిస్ట్‌లో చేరడానికి వడవడిగా అడుగులు వేస్తోంది.ట్రాన్స్‌జెండర్ మహిళలు, బాలికలు .మహిళా క్రీడా జట్లకు పోటీగా మారకుండా నిరోధించడమే ఈ బిల్లుల లక్ష్యం.
దీనిపై ట్రాన్స్ మహిళలు, బాలికల సంఘాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.ఈ బిల్లులు ట్రాన్స్ జెండర్లపై వివక్షతో కూడిన దాడిగా సమాన హక్కుల కార్యకర్తలు అభివర్ణించారు.
కాగా, అలబామా, అర్కాన్సాస్, ఫ్లోరిడా, మిసిసిపీ, మోంటానా, టెనెస్సీ, వెస్ట్ వర్జీనియా రాష్ట్రాలు ట్రాన్స్ జెండర్లు క్రీడల్లో పాల్గొనకుండా నిషేధించే బిల్లులను తొలుత ఆమోదించాయి.తాజాగా దక్షిణ డకోటా గవర్నర్ క్రిస్టీ నోయమ్ ట్రాన్స్‌జెండర్ క్రీడల నిషేధానికి మద్దతు ఇచ్చే కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఇటీవల సంతకం చేశారు.అయితే ఇదాహో గత ఏడాది ఇదే రకమైన చట్టాన్ని ఆమోదించగా… దీనిని ఫెడరల్ కోర్టు అడ్డుకున్న సంగతి తెలిసిందే.
టెక్సాస్ సెనేట్‌లోని రిపబ్లికన్లు ఈ ఏడాది పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించిన సంగతి తెలిసిందే.వీటిలో ఓటు వేయడాన్ని మరింత కష్టతరం చేయడంతో పాటు అబార్షన్లపై నిషేధం, హ్యాండ్‌గన్‌ను తీసుకెళ్లడానికి ముందస్తు అనుమతి లేకుండా చేయడం వంటివి వున్నాయి.