ఉన్నత విద్య, మంచి ప్యాకేజ్‌తో వేతనం పొందాలనే భారతీయ విద్యార్ధులకు డెస్టినేషన్ అమెరికా.నాణ్యతతో కూడిన విద్య, మెరుగైన జీవన విధానం వల్ల మన విద్యార్ధులు తమ బంగారు భవిష్యత్‌ను అమెరికాలోనే వెతుక్కుంటున్నారు.
ఉన్నత విద్యను పూర్తి చేసి అక్కడే మంచి ఉద్యోగం సంపాదించి శాశ్వతంగా అమెరికాలో నివాసం ఏర్పరచుకోవాలనేది లక్షల మంది కల.ఈ క్రమంలోనే ఏ యేటికాయేడు విద్యార్ధుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.అంతేందుకు కరోనా విపత్కర పరిస్ధితుల్లోనూ అగ్రరాజ్యానికి వెళ్లే విద్యార్ధుల సంఖ్యలో ఏ మాత్రం మార్పు లేదు.తల్లిదండ్రులు సైతం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తమ బిడ్డలను అమెరికా విమానం ఎక్కిస్తున్నారు.
ఈ క్రమంలో భారతీయ విద్యార్ధులకు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు కొందరు అమెరికన్ చట్ట సభ సభ్యులు.
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులు చదువు పూర్తయ్యాక స్వదేశాలకు వెళ్లాల్సిందేనని కొందరు చట్టసభ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులు చేయాలని కోరుతున్నారు.ఈ నేపథ్యంలోనే విదేశాలకు చెందిన విద్యార్థులు చదువు పూర్తయినా అక్కడే ఉంటూ ఉద్యోగం వెతుక్కోవడానికి వీలుకల్పించే ఆప్షనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని కోరుతూ బిల్లును ప్రవేశపెట్టారు.
ఇది కనుక చట్టంగా మారితే విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువు పూర్తి చేసిన వెంటనే స్వదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది.
ఈ నిర్ణయం భారతీయ విద్యార్ధుల పాలిట శరాఘాతంలా మారనుంది.
ఓపీటీ ప్రోగ్రామ్ ఆధారంగా అమెరికాలో ఉంటున్న 80 వేల మంది భారతీయ విద్యార్థులు పెట్టే బేడా సర్దేసి స్వదేశానికి రావాల్సిందే.ఓపీటీని తొలగించడం కోసం ‘ఫెయిర్‌నెస్ ఫర్ హై-స్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్’ పేరుతో ప్రతినిధుల సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
కాంగ్రెస్ సభ్యులు పాల్ ఎ గోసర్, మో బ్రుక్స్, ఆండీ బిగ్స్, మాట్ గెట్జ్‌లు ఈ బిల్లును ప్రవేశపెట్టారు.ఓపీటీ విధానం వల్ల అమెరికాకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు.
విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులు చౌకగా లభిస్తుండటంతో అమెరికాలోని కంపెనీలు వారికే ఉద్యోగాలిస్తున్నాయని, స్థానికులకు అన్యాయం చేస్తున్నాయని చట్టసభ సభ్యులు మండిపడుతున్నారు.అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టిన సభ్యులు రిపబ్లికన్ పార్టీకి చెందినవారు కావడంతో ఈ బిల్లు సెనేట్ ఆమోదం పొందడం అంత తేలిక కాదని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలోని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో కోర్సులు చదువుతున్న లేదా పూర్తి చేసుకున్న విద్యార్థులు.తమ కోర్సుకు సంబంధించిన రంగంలో తాత్కాలిక పద్ధతిలో నిర్దేశిత వ్యవధిలో ఆయా సంస్థల్లో పని చేసే అవకాశం కల్పించే విధానమే.ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ).
ప్రీ కంప్లీషన్ ఓపీటీ, పోస్ట్ కంప్లీషన్ ఓపీటీ పేరుతో రెండు రకాల విధానాలు అమలవుతున్నాయి.ఓటీపీ సమయంలో చక్కటి పనితీరు కనబరిస్తే.హెచ్-1బీ వీసా పొందే అవకాశం ఉంటుంది.అధిక శాతం సంస్థలు ఓటీపీ అభ్యర్థుల తరఫున పిటిషన్లు దాఖలు చేస్తున్నట్లు యూఎస్ ఇమిగ్రేషన్ వర్గాల సమాచారం
.