తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు ఏపీ ప్రభుత్వం తీసుకుంది.ఇంతకాలం ఏవోగా ఉన్న అనీల్ కుమార్ సింఘాల్ ని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది.
ప్రస్తుతం డిప్యూటీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి తాత్కాలిక బాధ్యతలు తీసుకున్నారు.ఇదిలా ఉంటే టీటీడీ బోర్డు తాజాగా మరో కీలక నియామకం చేసింది.
టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా ప్రముఖ గాయని, అన్నమాచార్య పాటలని ప్రజల్లోకి తీసుకెళ్లివాటికీ విశేష గుర్తింపు తీసుకురావడంలో కృషి చేసిన పద్మశ్రీ శోభారాజుని నియమించింది.దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రతిపాదనని ఏపీ ప్రభుత్వానికి పంపించగా దానిని ప్రభుత్వం ఖరారు చేసింది.
ఆమె నియామకంకి సంబంధించి దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.శోభారాజు రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.అన్నమాచార్య కీర్తలని ఆలపించడంతో పాటు వాటిని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో టీటీడీ తీసుకొచ్చిన టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టులో ఆమె పని చేశారు.వెంకటేశ్వర స్వామికి విశేషంగా సేవలు అందించిన భక్తురాలు శోభారాజుకి ఇంతకాలానికి సముచిత స్థానం లభించడం విశేషం.
గతంలో ఆమె పలు వేదికలపై అన్నమాచార్య కీర్తనలను ఆలపించారు.మంచి కవయిత్రిగా కూడా శోభారాజు పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.
మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి సంగీత విద్వాంసులు ఈ స్థానంలో గతంలో పని చేశారు.వెంకటేశ్వర స్వామికి తన సంగీతంతో పూర్తి స్థాయిలో సేవ చేసుకునే అవకాశం రావడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.