దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతూ వస్తున్న తరుణంలో, తిరిగి పుంజుకు నేందుకు, పునర్వైభవం తెచ్చుకునేందుకు అన్ని రకాలుగానూ ఆ పార్టీ ప్రయత్నిస్తూ వస్తోంది.ఇది ఇలా ఉండగా, తాజాగా సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ కొత్త డిమాండ్ తెరపైకి తెస్తూ, గాంధీయేతర వ్యక్తిని కాంగ్రెస్ రథసారథిగా నియమించాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది ఇలా ఉండగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు 23 మంది సోనియాను ఉద్దేశించి ఘాటుగా రాసిన లేఖ ఇప్పుడు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
ప్రస్తుతం ఉన్న నాయకత్వాన్ని వెంటనే మార్చాలని, పార్టీలో సమూలంగా ప్రక్షాళన చేపట్టాలంటూ, 23 మంది సీనియర్ నాయకులు ఆదివారం సోనియాకు లేఖ రాశారు.
పార్టీని గాడిలో పెట్టగల సమర్ధుడైన నాయకుడుని అధ్యక్షుడిగా నియమించాలని, దూరదృష్టి, క్రియాశీలకంగా వ్యవహరించే వారికే పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేస్తూ, పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కపిల్ సిబాల్, భూపెందర్ సింగ్ హుడా, పృథ్వీరాజ్ చవాన్, శశిధరూర్, మిలింద్ దేవరా, జితిన్ ప్రసాద్ తదితర ప్రముఖులు లేఖ రాయడంతో సోమవారం సిడబ్ల్యుసి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
ప్రస్తుతం సోనియా వయస్సు పెరగడం, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో, రాహుల్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.దీంతో కొత్త రథసారథి కోసం ఎప్పటి నుంచో కాంగ్రెస్ వేట మొదలు పెట్టింది.ఇప్పటికే గాంధీ యేతరులకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుండడంతో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై అధిష్టానం దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.
ఇప్పటికే గాంధీ కుటుంబం నాయకత్వం రేసులో లేదంటూ ప్రియాంక గాంధీ తేల్చి చెప్పడంతో పార్టీలో ఉన్న సమర్థులైన నాయకులను ఎంపిక చేసే పనిలో సోనియా నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ ను కుటుంబ పార్టీ అంటూ బిజెపి టార్గెట్ చేసుకుని ప్రతి దశలోనూ విమర్శలు చేస్తూ వస్తుండడంతో, గాంధీయేతరులకు పార్టీ బాధ్యతలు అప్పగించి, ఆ విమర్శలకు చెక్ పెట్టాలని సోనియా చూస్తున్నారట.
ప్రస్తుత పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో అలజడి రేగింది.అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కింద స్థాయి నాయకులలోనూ ఉండడంతో, సోనియా నిర్ణయం పై ఉత్కంఠ నెలకొంది.