సామాజిక ఇతి వృత్తాలని కథలుగా చేసుకునే సినిమాలు తీసే దర్శకులు టాలీవుడ్ లో చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు.అలాంటి దర్శకులలో సునీల్ కుమార్ రెడ్డిది ఒక పంథా.
సామాజిక కోణం ఉన్న కథలలో ఒక్కొక్కరు ఒక్కో పాయింట్ తో సినిమాలు తీస్తూ ఉంటారు.అయితే సామాజిక అంశాలతో ప్రజలు ఇప్పటికి అనుభవిస్తున్న సాంఘిక దురాచారాలు, కష్టాలపై సునీల్ కుమార్ రెడ్డి సినిమాలు తీస్తూ ఉంటారు.
ఆయన తీసిన సొంత ఊరు, గంగపుత్రులు, గల్ఫ్, ఓ రొమాంటిక్ క్రైమ్ కథ, ఓ క్రిమినల్ ప్రేమ కథ లాంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కొన్ని మంచి హిట్ టాక్ కూడా తెచ్చుకున్నాయి.ఇప్పుడు ఆయన కరోనా సమయంలో వలస కార్మికులు సొంత గ్రామాలకి రావడానికి అనుభవించిన కష్టాలని ఇతివృత్తంగా మార్చుకొని వలస టైటిల్ తో సినిమాని తెరకెక్కించారు.
మనోజ్ నందం, వినయ్ మహాదేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగు కూడా పూర్తయింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు.బ్రతుకు తెరువు కోసం పట్టణాలకి వెళ్లి అక్కడ వారు ఎలాంటి దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు, కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి చేతిలో పైసలు లేక, ప్రయాణానికి రవాణా సౌకర్యం లేక కాలి బాటన సొంత ఊరికి నడుచుకుంటూ వచ్చిన వలస కూలీలు ఎలాంటి కష్టాలు అనుభవించారు అనే ఎలిమెంట్స్ ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.మరొక్కసారి సామాజిక సమస్యలని ప్రధానంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమాకి ఎలాంటి ఆదరణ వస్తుందో చూడాలి.