హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో ఫ్లై ఓవర్ ను సోమవారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఇన్నర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు బైరామల్‌గూడ జంక్షన్లో ఫ్లై ఓవర్‌ను నిర్మించారు.
ఈ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోమంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
బైరామల్‌గూడ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ఎస్ఆర్డీపీ ఫేజ్-1లోని ప్యాకేజీ-2లో భాగంగా 784 మీటర్ల పొడవు బ్రిడ్జిని రూ.26.45 కోట్ల వ్యయంతో నిర్మించారు.ఎస్ఆర్డీపీ ప్యాకేజీ-2లో భాగంగా రూ.448 కోట్ల అంచనా వ్యయంతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో చేపట్టిన 14 పనులలో ఇప్పటికే ఆరు పూర్తి కాగా, మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఎల్బీనగర్ జంక్షన్లో నిర్మించిన అండర్ పాస్, బైరామల్‌గూడ, నాగోలు కామినేని చౌరస్తా, చింతల్ కుంట అండర్ పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి.దీంతో రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.
కాగా, బైరామల్‌గూడ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ నిర్మాణానికి దేశంలోనే మొదటిసారి ప్రత్యేక టెక్నాలజీని వినియోగించారు.ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి మొదటిసారి స్లాబ్స్, క్రాష్ బారియర్స్, ఫిక్షన్ స్లాబుల నిర్మాణంలో ఆర్సీసీ ఫ్రీకాస్ట్ టెక్నాలజీని వినియోగించారు.
ఇక ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో బైరామల్ గూడ జంక్షన్, సాగర్ రోడ్ జంక్షన్లలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.