దేవాలయ భూముల ఆక్రమణ దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.బుధవారం జంట నగరాల పరిధిలోని దేవాదాయ భూముల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ దేవాదాయ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ, విజిలెన్స్ జాయింట్ సెక్రటరీ శేఖర్, అదనపు కమిషనర్ శ్రీనివాస రావు, రీజినల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నిరుపయోగంగా ఉన్న ఆలయ భూములను గుర్తించి, వాటి ద్వారా ఆదాయం పొందే మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
దేవాదాయ శాఖకు సంబంధించి ఆస్తుల లీజుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అన్నారు.నామమాత్రపు ధరకు దేవాదాయ శాఖ షాపులను లీజుకు తీసుకుని.తిరిగి వాటిని అధిక ధరకు లీజుకు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.దశాబ్దాల క్రితం నాటి లీజులతో పాటు అద్దె విషయంలో పున:సమీక్షించాలని చెప్పారు.దీర్ఘ కాలంగా కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న ఆలయ భూముల వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
హైదరాబాద్ పరిధిలో 13 ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న దేవాదాయ భూముల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు, కళ్యాణ మండపాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ మంత్రులకు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ద్వారా 1,300 ఎకరాల ఆలయ భూములను గుర్తించి వెనక్కి తీసుకున్నామని తెలిపారు.మరో 21 వేల ఎకరాల ఆలయ భూములకు రక్షణ సరిహద్దు బోర్డులు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.