కేరళను ప్రవాస భారతీయుల సొమ్ము ముంచెత్తుతోంది.ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి థామస్ ఐజాక్ తెలిపారు.
ఇది దేశంలోని బ్యాంకుల కంటే అధిక వృద్ధి రేటుగా ఆయన తెలిపారు.కేరళ అసెంబ్లీలో ప్రభుత్వ ఆర్ధిక సమీక్షపై థామస్ మాట్లాడుతూ.మార్చి 2019 నాటికి మొత్తం ఎన్ఆర్ఐ డిపాజిట్లు 11.83 శాతం పెరిగాయన్నారు.అదే సమయంలో 2018 మార్చిలో ఎన్ఆర్ఐ డిపాజిట్ల విలువ 1,69,944 కోట్లు ఉండగా 2019 నాటికి 1,90,055 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.
ప్రస్తుతం ఈ వృద్ధి దేశీయ డిపాజిట్ల వృద్ధి కంటే 9.45 శాతం పెరిగి రూ.2,77,291 కోట్ల నుంచి రూ.3,03,507 కోట్లకు చేరుకుంది.రివర్స్ మైగ్రేషన్ ఉన్న ప్రస్తుత తరుణంలోనూ పెరుగదల నమోదవ్వడం గమనించాల్సిన విషయమని ఐజాక్ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్ఆర్ఐ డిపాజిట్లు ప్రైవేట్ రంగంలోని డిపాజిట్ల వాటా కంటే ఒక శాతం తక్కువగా నమోదైనట్లు ఎకనమిక్ రివ్యూ వెల్లడించింది.సెంటర్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ నిర్వహించిన కేరళ మైగ్రేషన్ సర్వేలో ప్రపంచంలోని వివిధ దేశాలలో 2.1 మిలియన్ల మంది మలయాళీలు ఉన్నట్లుగా తేలింది.
దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కంటే కేరళ సర్కార్ ఎన్ఆర్ఐలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది.వారి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన సాయం చేస్తోన్న సంగతి తెలిసిందే.ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఎన్ఆర్ఐలకు పన్ను విధింపును వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపింది.
కొన్ని లక్షల మంది ప్రవాస భారతీయులు విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తూ భారతదేశం అభివృద్దికి సాయం చేస్తున్నారు.అటువంటి ప్రవాస భారతీయులను ఇబ్బంది పెట్టొద్దని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.