ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.ఎన్నికల ముందు ఏ పార్టీ గాలి బలంగా వీస్తుందో, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని నాయకులు పార్టీలు మారిపోతుంటారు.
ఇదంతా రాజకీయాల్లో సర్వ సాధారణంగా జరిగే తంతు.ఆ విధంగానే ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు చాలామంది నాయకులు వైసీపీలోకి వచ్చి చేరారు.
టీడీపీలోకి వెళ్ళాక పదవులు చేపట్టిన వారు, బలమైన నాయకులు కూడా జగన్ మీద నమ్మకంతో పార్టీలో చేరారు.అయితే ఇలా వచ్చి చేరినవారు ఇప్పుడు వైసీపీలో గుర్తింపు కోసం, ప్రభుత్వంలో పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ లేనిపోని వివాదాలకు కారణం అవుతున్నారు.

వాస్తవంగా చెప్పకుంటే మొదటి నుంచి వైసీపీకి అండగా నిలబడి ఎన్నో ఇబ్బందులకు గురైన నాయకులు చాలామంది ఉన్నారు.ఉదాహరణగా చెప్పుకుంటే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, విజయ సాయి రెడ్డి ఇంకా మరి కొంతమంది నాయకులు వైసీపీకి అండగా నిలుస్తూ వస్తున్నారు.ఒకరకంగా వైసీపీని మొదటి నుంచి అండగా నిలబడుతూ వస్తున్నచాలామంది నాయకులకు ప్రభుత్వంలో ఇప్పటి వరకు సరైన, కీలకమైన పదవులు దక్కలేదు.అయినా వారు ఓపికతో, జగన్ మీద నమ్మకంతో పార్టీ విధేయులుగా ఉంటూ వస్తున్నారు.
కానీ ఎన్నికలకు ముందు ఆ తరువాత పార్టీలో చేరిన కొంతమంది నాయకులు తమకు పదవులు రాలేదని బహిరంగంగా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

ఇలా జగన్ కు ఇబ్బందికరంగా మారిన వారిలో కొంతమందిని ఉదాహరణగా చూస్తే నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు ఆనం రాంనారాయణ రెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన ఆమంచి కృష్ణమోహన్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట నరసింహం, తోట వాణి వంటివారు ప్రధానంగా కనిపిస్తున్నారు.