తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలే అత్యంత ప్రాధాన్యమైన అంశాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Deputy CM Bhatti Vikramarka )అన్నారు.టీఎస్పీఎస్సీకి ( TSPSC )రూ.40 కోట్లు బడ్జెట్ లో కేటాయించామన్న ఆయన త్వరలోనే మెగా డీఎస్సీ( Mega DSC ) ఉంటుందని తెలిపారు.రాచరిక ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తామన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యం, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త చిహ్నం రూపొందిస్తామని పేర్కొన్నారు.వాహన రిజిస్ట్రేషన్ కోడ్ ను టీఎస్ నుంచి టీజీగా మార్చామన్నారు.
అలాగే రాష్ట్రంలో రైతును రాజుగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.రైతును నష్టం కలిగించే విత్తన చట్టాలను ఉపేక్షించబోమన్నారు.
ఈ మేరకు త్వరలోనే నూతన విత్తన చట్టం తీసుకురాబోతున్నామని తెలిపారు.ధరణి కొంతమందికి భరణంగా మరి కొంతమందికి ఆభరణంగా, చాలా మందికి భారంగా మారిందన్నారు.
గత ప్రభుత్వ తప్పులతో ఎంతోమంది సొంత భూమిని కూడా అమ్ముకోలేకపోయారని చెప్పారు.ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాలలను మరింత అభివృద్ధి చేస్తామన్న భట్టి విక్రమార్క గురుకులాలకు అన్ని వసతులతో కూడిన నూతన భవనాలను నిర్మిస్తామని తెలిపారు.గురుకుల పాఠశాలల సొసైటీ ద్వారా రెండు ఎంబీఏ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు.నాణ్యమైన విద్య అందించాలన్నదే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను సకాలంలో విడుదల చేయలేదన్నారు.ఈ నేపథ్యంలో తాము ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటుగా స్కాలర్ షిప్ లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఐటీఐ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు వందశాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.