అమెరికాను వింత వాతావరణ పరిస్థితులు వణికిస్తున్నాయి.ఓ వైపు మంచు, మరో వైపు తుఫాన్లు, టోర్నడోలతో జనం అల్లాడిపోతున్నారు.
శనివారం ఆగ్నేయ ప్రాంతంలో సంభవించిన తుఫాను కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా… 20 మిలియన్ల మందికి వరద ముంపు పొంచి వుంది.
అలబామా, కెంటుకీ, మిస్సీసిప్పీలలో టోర్నడోలు అపార నష్టం కలిగించాయి.
భీకర గాలులకు చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోయి కరెంట్ తీగలపై పడటంతో లక్షలాది మంది అంధకారంలో ఉన్నారు.జార్జియా, నార్త్ కరోలినా, దక్షిణ కరోలినాలోని కొన్ని ప్రాంతాలకు నేషనల్ వెదర్ సర్వీస్ టోర్నడో హెచ్చరికలను జారీ చేసింది.
శుక్రవారం రాత్రి నుంచి చోటు చేసుకున్న తుఫానుల కారణంగా టెక్సాస్‌లో ఇద్దరు, లూసియానాలో ముగ్గురు, అలబామాలో ముగ్గురు మరణించారు.
జార్జియా, లూసియానా, అర్కాన్సాస్, మిస్సిసిపీ, అలబామా, టేనస్సీ, కెంటుకీ, ఒహియో, టెక్సాస్, వెస్ట్ వర్జీనియాలలో భారీ వర్షం, బలమైన గాలులు కొనసాగుతున్నాయి.ఈ పది రాష్ట్రాల్లోని 3,50,000 ఇళ్లు, వ్యాపార సంస్థలు అంధకారంలో ముగ్గుతున్నాయి.పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలతో లూసియానా రోడ్లన్నీ నిండిపోయాయి.
దక్షిణాది ప్రాంతంలో తుఫాన్లు విరుచుకుపడుతుంటే.ఉత్తరాదిన ప్రాంతం చలి వణికిస్తోంది.కాన్సాస్ నుంచి మిచిగాన్ వరకు ఉన్న ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలితో ప్రజలు గడప దాటడం లేదు.ఓక్లహోమా, ఈస్ట్ కాన్సాస్, మిస్సోరీ, నార్త్ ఇల్లినాయిస్, ఈస్ట్ అయోవా, సౌత్ విస్కాన్సిన్, మిచిగాన్లలో మంచుతో, పాటు వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.
చికాగోలో బలమైన గాలులు వీయడంతో పాటు తేలికపాటి మంచు వర్షం కురవడంతో 1,100 విమాన సర్వీసులను శనివారం రద్దు చేశారు.