హిందువులు ముఖ్యంగా జరుపుకొనే అతి పెద్ద పండుగలలో సంక్రాంతి కూడా ఒకటని చెప్పవచ్చు.రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఈ పండుగను మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
సూర్యుడు ధనుర్మాసం నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ పండుగను మకర సంక్రాంతి అని కూడా పిలుస్తారు.
ధనుర్మాసం చివరి రోజును, సంక్రాంతికి ముందు రోజును భోగి అని పిలుస్తారు.ఈ భోగి రోజు నుంచి సంక్రాంతి పండుగ సంబరాలు మొదలవుతాయి.

భోగి రోజు తెల్లవారు జామున నిద్ర లేచి ఇంటిముందు అందమైన రంగవల్లులను వేసి అందులో భోగి మంటలను వేసి ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు.ధనుర్మాసంలో సూర్యుడు ఉత్తరాయణంలో ఉంటాడు.దక్షిణాయనం చివరి రోజు వాతావరణంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.అలాగే సూర్యుడు దక్షిణార్థ గోళంలో నుంచి ఉత్తరార్థ గోళంలో కి ప్రవేశించడం ద్వారా చలి ఎక్కువగా ఉండటం వల్ల ఈ చలి తీవ్రతను తట్టుకోవడం కోసం ప్రజలు మంటలను వేసుకుంటారు.
భోగి రోజు ఈ మంటలను వేయడం ద్వారా వీటిని భోగి మంటలు అని కూడా పిలుస్తారు.

ఈ భోగి మంటలను వేసుకొని ఇంతకుముందు పడిన కష్టాలను బాధలను తొలగించి సుఖ సంతోషాలతో గడపాలని భావించి మన ఇంట్లో ఉన్న పాత వస్తువులను ఈ మంటలలో వేసి తగల పెడుతుంటారు.అలాగే ఈ భోగిమంటల ద్వారా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.ఈ భోగి మంటలను ఎక్కువగా ఆవు పిడకలతో వేస్తారు.
ఆవు పిడకలు కాల్చడం ద్వారా మన వాతావరణంలో ఉన్న సూక్ష్మజీవులు నశించిపోయి, ఆక్సిజన్ గాలిలోకి అధికంగా విడుదలవుతుంది.ఈ గాలిని పీల్చడం ద్వారా చలికాలంలో వ్యాపించే అనేక వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు.
ఈ విధంగా భోగి పండుగ ప్రజలకు భోగభాగ్యాలను ఇవ్వడమే కాకుండా, మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుందని చెప్పవచ్చు.