ముఖ్యమంత్రి ఒక్కరే అన్ని బాధ్యతలు చూసుకోలేరు కాబట్టే శాఖల వారీగా మంత్రులను ఏర్పాటు చేసుకుని వారిని సమన్వయం చేసుకుంటూ పరిపాలన సాగిస్తూ ఉంటారు.ఆయా శాఖల పై పూర్తిగా మంత్రుల పట్టు సాధిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుంటారు.
అయితే జగన్ క్యాబినెట్ లో మెజార్టీ మంత్రుల వ్యవహార శైలి మాత్రం వేరేగా ఉంది.వారికి కేటాయించిన మంత్రిత్వ శాఖల పై పూర్తిగా పట్టు సాధించలేని పరిస్థితుల్లో చాలా మంది మంత్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కేవలం కొన్ని ప్రధాన శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నారు.జగన్ కు అత్యంత సన్నిహితులుగా ముద్ర పడిన వారు మాత్రమే పార్టీలోనూ ప్రభుత్వంలోనూ యాక్టివ్ గా ఉంటూ జగన్ కు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నారు. మంత్రి పదవులు కట్టబెట్టినా, ఉదాసీనంగా వ్యవహరిస్తున్న వారి వ్యవహార శైలిపై జగన్ కు ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయి.అయితే సదరు మంత్రులు వాదన మరోలా ఉంది.పేరుకే తాము మంత్రులమే తప్ప, తమకు స్వేచ్ఛ ఎక్కడ ఉంది అని, పూర్తిగా పార్టీలోని కొంతమంది కీలక నాయకులు ప్రభుత్వ సలహాదారు కనుసన్నల్లోనే అన్ని వ్యవహారాలు జరిగిపోతున్నాయని, తమకు తెలియకుండానే తమ శాఖల్లో ఎన్నో కార్యక్రమాలు జరిగిపోతున్నాయని , మంత్రిగా తమకు కనీస సమాచారం ఉండడం లేదని , తమ శాఖను పర్యవేక్షించే అధికారులు సైతం తమను లెక్క చేయడం లేదని, పూర్తిగా కొంతమంది సలహాదారులు చెప్పినట్లుగానే అధికారులు నడుచుకుంటున్నారు అని సదరు మంత్రులు వాపోతున్నారు.
మరికొంత మంది మంత్రులు యాక్టివ్ గా ఉంటూ, తమ శాఖల్లో కార్యకలాపాల ద్వారా సొమ్ములు చేసుకుంటున్నారట.తాము పదవుల్లోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి కావస్తుండడంతో తమ మంత్రి పదవులు ఎలాగూ ఊడిపోతాయి అని , అందుకే అందినకాడికి వెనకేసుకోవాలి అనే అభిప్రాయంతో చాలా మందే ఉన్నారట.అయితే ఏ మంత్రి ఏమి చేస్తున్నారనే విషయంపై జగన్ కు ఎప్పటికప్పుడు సమాచారం చేరి పోతుండడతో ఇక ఈ వ్యవహారంపై పూర్తిగా దృష్టి పెట్టి గట్టి వార్నింగ్ ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నారట.
ఎలాగూ త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టటనున్న నేపథ్యంలో అటువంటి వారిపై వేటు వేయాలని జగన్ ఫిక్స్ అయిపోయారట.