దేశవ్యాప్తంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన ఏ రాజకీయ పార్టీకి రాజకీయ వ్యూహాలు అందిస్తారో, ఆ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ బలంగా రాజకీయ పార్టీల నేతల్లో ఉండడంతో, ఈ స్థాయిలో ఆయనకు క్రేజ్ ఏర్పడింది.
దీనికి తోడు ఆయన రాజకీయ వ్యూహాలు అందించిన ప్రతి పార్టీ అధికారంలోకి వస్తూ ఉండటంతో, ఈ సెంటిమెంట్ మరింతగా బలపడింది .ఇక 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ సేవలు బాగా పనిచేశాయి.ఎన్నికలకు చాలా కాలం ముందు నుంచే ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు జగన్ అమలు చేశారు.
అప్పటి అధికార పార్టీ టిడిపిని ఇరుకునపెట్టడంలో ప్రశాంత్ కిషోర్ , జగన్ సక్సెస్ అయ్యారు .175 నియోజకవర్గాలకు గాను 151 సీట్లతో వైసిపి అఖండ మెజారిటీతో గెలుపొంద డానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో పాటు, అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన ఇచ్చిన సలహాలు వంటివి బాగా పనిచేశాయి.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ అవసరం లేకుండా పోయింది.
దీంతో పాటు ఆయన జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారడంతో, అనేక రాజకీయ పార్టీ వ్యూహాలు అందించడం వంటి వ్యవహారాల్లో బిజీ అయిపోయారు.

అయితే గత కొద్ది నెలలుగా వైసిపి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, వ్యతిరేకత పెరుగుతుందనే సంకేతాలు జగన్ ను ఆందోళన లోకి నెట్టాయి.దీంతో ప్రశాంత్ కిషోర్ అవసరం జగన్ కు ఏర్పడింది.
దీంతో ఆయన టీం రంగం లోకి దిగింది.మంత్రివర్గ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ సేవలు మళ్లీ వైసీపీలో మొదలు కాబోతున్నట్టు స్వయంగా జగన్ సైతం ప్రకటించారు .నవంబర్ లో ప్రశాంత్ కిషోర్ టీం పూర్తిగా రంగంలోకి దిగుతుంది అని జగన్ ప్రకటించారు .అయితే ఇప్పుడు ఆ హడావుడి కనిపించకపోవడంతో అసలు ఏం జరిగిందనే చర్చ వైసీపీలోనే మొదలైంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ అవసరం పెద్దగా లేదని ఇప్పటి నుంచే ఏపీలో ఎన్నికల కు సంబంధించిన సర్వే నిర్వహించినా ఫలితం ఉండదని , ఎన్నికలకు ఏడాది ముందు గా రంగంలోకి దిగితే సరిపోతుందనే అభిప్రాయం ప్రశాంత్ కిషోర్ , జగన్ చర్చల మధ్య చోటుచేసుకోవడంతోనే ప్రశాంత్ కిషోర్ సేవలకు బ్రేక్ పడినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.