నిర్భయ నిందితులు తమకు పడిన ఉరిశిక్షను తప్పించుకునేందుకు ఒక్కొక్కరూ ఒక్కో సమయంలో పిటీషన్ దాఖలు చేస్తూ కాలహరణం చేస్తూ వస్తున్నారు.ఫిబ్రవరి 1 వ తేదీన నిర్భయ నలుగురు నిందితులకు ఉరిశిక్షలు అమలు చేయాలి అని ఢిల్లీ పటియాలా కోర్టు తీర్పు వెల్లడించిన తరువాత కూడా ఎదో ఒక పిటీషన్ తో కాలయాపన చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో తాజాగా క్యురేటివ్ పిటీషన్లు,రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం పిటీషన్లు దాఖలు చేసుకొనేందుకు అవసరమైన ధ్రువ పత్రాలు తీహార్ జైలు అధికారులు ఇవ్వలేదంటూ నిందితుల్లో ముగ్గురు తరపు న్యాయవాది ఢిల్లీ హైకోర్టు లో పిటీషన్ లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ పిటీషన్ లపై విచారించిన ఢిల్లీ కోర్టు వాదోపవాదనలు విన్న తరువాత కోర్టు ఆ పిటీషన్ లను కొట్టేసింది.
ఢిల్లీ పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ దోషులకు ఎప్పుడెప్పుడు ఏయే పత్రాలు అందించింది సవివరంగా తెలిపారు.దోషుల తరపు న్యాయవాది మాట్లాడుతూ వినయ్ శర్మపై విషప్రయోగం జరిగిందని, అందుకే అతన్ని ఆసుపత్రిలో చేర్చారని,
దీనికి సంబంధించి వైద్య ధ్రువపత్రం ఇప్పటికీ ఇవ్వలేదంటూ మరో విషయాన్నీ తేవనేత్తి కోర్టు దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించారు.అయితే కోర్టు మాత్రం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చిన వివరణ సంతృప్తిగా ఉందంటూ చెప్పి పిటీషన్ లను కొట్టేసింది.దీనితో పటియాలా కోర్టు నిర్ణయించిన ప్రకారం ఆ నిర్భయ నిందితుల ఉరి ఫిబ్రవరి 1 వ తేదీనే అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.