అన్ని విషయాల్లోనూ జనసేన పార్టీ స్పీడ్ పెంచింది.ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, 2024 ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన రాజకీయ అడుగులు వేగంగా వేస్తోంది.
గతంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ సైతం కీలకమైన నిర్ణయాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా తీసుకున్నారు.ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తో సమానంగా జనసేన కూడా వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తూ ఈ మధ్యకాలంలో బాగా హైలెట్ కావడం, ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతంలో జనసేన ప్రభావం పెరగడం వంటి కారణాలతో మరింత ఉత్సాహంగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ నెల 4వ తేదీన మంగళగిరి పార్టీ కార్యాలయంలో కీలక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
ఈ సమావేశానికి పార్టీలోని అన్ని స్థాయిలు కలిగిన నేతలను ఆహ్వానిస్తున్నారు.
ఇటీవల పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని పవన్ కళ్యాణ్ నిర్వహించారు.మళ్ళీ వెంటనే ఈ తరహా సమావేశాలు నిర్వహించడానికి కారణాలు చాలానే ఉన్నాయట.
ఇప్పటి నుంచే కీలక నిర్ణయాలు తీసుకోకపోతే, పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది అనే కారణం తోనే స్పీడ్ పెంచినట్టు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ ఈ నెల మూడో తేదీ సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు.
ఈ సమావేశం ద్వారా రాబోయే రోజుల్లో జనసేన ను జనం లోకి ఏ విధంగా తీసుకు వెళ్లాలి ? ఏ అంశాలపై పోరాటం చేయాలి ? ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి ? జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు, జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర తో పాటు మరికొన్ని అంశాలపై అనేక తీర్మానాలు చేయబోతున్నట్లు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.

అంతేకాదు జనసేన కార్యకర్తలపై ఇటీవల కాలంలో వైసిపి నాయకులు పెడుతున్న కేసుల విషయంపై డీజీపీ ని కలిసి ఫిర్యాదు చేయాలని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అందరికీ పార్టీ అండగా ఉంటుందనే అభిప్రాయం కలిగించేందుకు పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారట.వీటితో పాటు అనేక కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి తగిన కార్యాచరణ ప్రకటించేందుకు జనసేన సిద్ధమవుతోంది.