ఏపీలో వైసిపి 175 నియోజకవర్గాలకు గాను 150 స్థానాల్లో విజయం సాధించింది.23 స్థానాలు టిడిపి , ఒక స్థానం జనసేన పార్టీలు సొంతం చేసుకున్నాయి.టిడిపి నుంచి గెలిచిన నలుగురు జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే జగన్ కు జై కొట్టారు.అయితే ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి ఏవిధంగా ఉందనే విషయం పై జగన్ దృష్టి పెట్టారు.
ఎప్పటి నుంచో ఈ నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాల కారణంగా పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది అనే విషయాన్ని జగన్ గుర్తించారు. ఎప్పటికప్పుడు అన్ని నియోజకవర్గాలోని పరిస్థితులను వివిధ సర్వేల ద్వారా తెలుసుకుంటూ, వాస్తవ పరిస్థితులు ఏమిటనేది అంచనా వేస్తున్నారు.
ఎన్నికల్లో ఓటమి చెందిన నియోజక వర్గాలతో పాటు , టిడిపి జనసేన పార్టీల నుంచి గెలిచి వైసిపికి మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని, రాజకీయాల కారణంగా పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అనే విషయాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారు. అందుకే మొత్తం 24 నియోజకవర్గాల్లోని వైసిపి ఇన్చార్జిలతో పాటు, ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకులతో ప్రత్యేకంగా నియోజకవర్గాల వారీగా సమావేశం నిర్వహించాలని చూస్తున్నారు.
ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆ నియోజకవర్గాలకు చెందిన నాయకులకు కీలకమైన నామినేటెడ్ పదవులను పెద్దఎత్తున ఇచ్చారు.అయినా గ్రూపు రాజకీయాలు కారణంగా, సొంత పార్టీ నేతలే పార్టీ విజయానికి అడ్డంకిగా మారడాన్ని జగన్ సీరియస్ గానే తీసుకున్నారు.
ఇవే అంశాలను అయా నియోజకవర్గ నాయకులతో భేటీ సందర్భంగా ప్రస్తావించాలని , ఇకపై గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ పార్టీకి నష్టం చేకూర్చే నాయకులను అవసరం అయితే పార్టీ నుంచి బహిష్కరించేందుకు కూడా వెనుకాడబోమనే విషయాన్ని జగన్ సీరియస్ గా చెప్పబోతున్నారట.

పార్టీలో గ్రూపు రాజకీయాలను చూసి చూడనట్లుగా వదిలేస్తే, అది 2024 ఎన్నికల ఫలితాల పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అని జగన్ నమ్ముతున్నారు.అందుకే ఇప్పుడు ఓడిన నియోజకవర్గాలపై దృష్టి పెట్టి పార్టీ ఇన్చార్జి లను , నియోజకవర్గంలోని కీలక నాయకులను యాక్టీవ్ చేసి, 2024 ఎన్నికల్లో ఎటువంటి డోకా లేకుండా చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా అర్థం అవుతోంది.