త్వరలో ఏపీ శాసనమండలి ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుతం దాదాపు 22 స్థానాలు ఖాళీ అవుతుండగా వీటిలో శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికయ్యేవారు ఏడుగురు ఉన్నారు.
ఇందులో ప్రస్తుత బలాబలాలను బట్టి టీడీపీకి 6 వైకాపాకు ఒక స్థానం లభించనున్నాయి.దీంతో అభ్యర్థులు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.
అధినేత దృష్టిలో పడేందుకు ఇప్పటి నుంచే తమ అర్హతలను బేరీజు వేసుకుంటున్నారు.దీంతో పోటీ అధికమవుతున్న కొద్దీ.
ఎమ్మెల్సీ సీటుకు క్రేజు కూడా పెరిగిపోతోంది.
అసలు ఎమ్మెల్సీ సీటుకు ఎందుకు అంత క్రేజ్ అంటే…ఒకసారి శాసన మండలిలోకి ప్రవేశిస్తే ఆరేళ్లపాటు నిశ్చింతగా ఉండవచ్చు.
మరో రెండేళ్లలో శాసనసభకు సాధారణ ఎన్నికలు ఎటూ రాబోతున్నాయి.అప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తమ స్థానం ఆపై నాలుగేళ్లపాటు సుస్థిరంగా ఉంటుంది.
దీంతో అధికార పక్షంలో ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది.ప్రధానంగా కృష్ణా జిల్లా నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి – న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ – పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు – పశ్చిమ నియోజకవర్గ ఇన్ చార్జి నాగుల్మీరా ఎవరికివారు తమ రాజకీయ గాడ్ ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
తనకు ఇప్పటివరకు ఎలాంటి నామినేటెడ్ పదవికి గాని ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారైనా పోటీచేసే అవకాశం గాని రాలేదంటూ గొట్టిపాటి వాదిస్తున్నారు.ఈ ప్రకారం చూస్తే అర్జునుడు గత ఎన్నికల్లో నూజివీడు సీటు ఆశించి కొంతకాలం పాటు ఇన్ చార్జ్ గానూ అక్కడ పార్టీ బలోపేతానికి కృషి చేశారు.
ప్రస్తుతం అర్జునుడు జిల్లా పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు.ఇక నాగుల్ మీరా 1999 ఎన్నికల్లో పోటీచేసి జలీల్ ఖాన్ (వైకాపా) చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.
తాజాగా ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టీడీపీలోకి ప్రవేశించడంతో వచ్చే ఎన్నికల్లో కూడా సీటు రాదనే భావనతో ఆయన ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారు.ఇక గొట్టిపాటి పార్టీ తరపున పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలోని శిక్షణ కేంద్రానికి ఇన్‌చార్జిగా ఉంటూ ఇప్పటికి దాదాపు 10వేల మంది నాయకులు కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి గుర్తింపు పొందారు.
ఇక గుంటూరు జిల్లాలో మాజీ శాసనసభ్యులు జియావుద్దీన్ డాక్టర్ చందు సాంబశివుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బరావు పోటీ పడుతున్నారు.వీరితో పాటు మిగతా జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్సీ సీటును ఆశించే వారి సంఖ్య భారీగానే ఉంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు మనసు గెలుచుకొని ఎమ్మెల్సీ సీటు కైవసం చేసుకునే ఆ ఆరుగురు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది.