చాలా కాలంగా టిడిపి విజయవాడ ఎంపీ కేసినేని నాని వ్యవహారం ఆ పార్టీలో హాట్ టాపిక్ గానే మారింది.2014, 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిన నాని రెండోసారి ఎంపీ అయిన తర్వాత పార్టీలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు.ముఖ్యంగా చంద్రబాబు కోటరి నాయకులుగా పేరుపొందిన బుద్ధ వెంకన్న, బోండా ఉమ వంటి వారితోను విభేదాలు తలెత్తినా బాబు చొరవతో ఆ విభేదాలను పరిష్కరించుకున్నారు.ఇక అంతా బాగానే ఉంది అనుకుంటున్నా గత కొంతకాలంగా నాని పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు, అసలు రాజకీయాల్లోనే ఉండేందుకు ఇష్టం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసేదే లేదు అంటూ ప్రకటనలు చేస్తున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా, అధినేత చంద్రబాబుతో నాని వ్యవహరిస్తున్న తీరు టిడిపిలోనే కాదు, మిగతా రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
నిన్న ఢిల్లీకి వచ్చిన చంద్రబాబుకు స్వాగతం చెప్పేందుకు టిడిపి ఎంపీలంతా ఎయిర్ పోర్ట్ కు వచ్చారు.ఈ సందర్భంగా బాబుకు స్వాగతం చెబుతూ బొకే ఇచ్చేందుకు ఎంపీలు ప్రయత్నించారు.
ఆ సమయంలో నానికి బొకేను ఎంపీ గల్లా జయదేవ్ నానితో ఆ బొకే ఇప్పించే ప్రయత్నం చేయగా నాని దాదాపు విసిరి కొట్టినంత పని చేశారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, నాని వ్యవహార శైలి పై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
పార్టీ అధినేత విషయంలో నాని ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న, ఆయనపై చర్యలు తీసుకునేందుకు బాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది.

గత కొంత కాలం నుంచి నాని వ్యవహార శైలి వివాదాస్పదంగానే ఉన్నా, చంద్రబాబు పైన విమర్శలు చేసినా… ఇటీవల నాని కుమార్తె వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి చంద్రబాబు కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు.ఇది జరిగి వారం కూడా కాలేదు ఇప్పుడు ఎయిర్ పోర్ట్ లో నాని ఈ విధంగా ప్రవర్తించినా బాబు సైలెంట్ గా ఉండిపోవడంతో టిడిపిలో క్రమశిక్షణ లోపించిందని, చంద్రబాబు ఎవరి పైన చర్యలు తీసుకునే సాహసం గతంలో మాదిరిగా చేయలేకపోతున్నారని,అదే నాని వంటివారికి అలుసుగా మారింది అంటూ టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు.