యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసి,పోస్ట్ మార్టం కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థపాక అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం సంఘం ఆధ్వర్యంలో శ్రీకాంత్ చారి చౌరస్తా వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోత్కూరులో 30 పడకల ఆసుపత్రి లేకపోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు సరైన వైద్యం అందుబాటులో లేకుండా పోయిందని,అలాగే పోస్ట్ మార్టం సౌకర్యం లేక త్రీవ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుత పి.హెచ్.సిని 30 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేస్తే మోత్కూరుతో పాటు గుండాల,అడ్డగూడూరు, ఆత్మకూర్(ఎం),దేవరుప్పుల,తిరుమలగిరి,నార్కట్ పల్లి ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.30 పడకల ఆసుపత్రి,పోస్ట్ మార్టం సౌకర్యాన్ని కల్పించడానికి అధికారులు,ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్,బీసీ సంఘం రాష్ట్ర నాయకులు బయ్యని పిచ్చయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి వడకాల దయాకర్,గంజి రాములు, సరబోజు రవీంద్రచారి, చెరుకు ఉప్పలయ్య, దొంతోజు సోమలింగం, బోడ భాస్కర్,గొడిశాల బాపయ్య,బుంగ నవీన్, ముత్తయ్య,అరిఫ్,వేణు తదితరులు పాల్గొన్నారు.