బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ 3( Charles III ) పట్టాభిషేకం గత శనివారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.ప్రపంచం నలుమూలల నుంచి అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
బ్రిటన్ రాజకుటుంబ సాంప్రదాయాల ప్రకారం కింగ్ ఛార్లెస్ 3కి కిరీట ధారణ చేశారు.ఇదిలావుండగా.
పట్టాభిషేకానికి హాజరైన అతిథుల కోసం యూకే ప్రధాన మంత్రి రిషి సునక్( Rishi Sunak ) విందు ఇచ్చారు.డౌనింగ్ స్ట్రీట్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ విందులో పాల్గొనే అవకాశాన్ని పొందారు ‘‘పాయింట్స్ ఆఫ్ లైట్’’ అవార్డును గెలుచుకున్న భారత సంతతికి చెందిన సిక్కు ఇంజనీర్ నవజోత్ సాహ్నీ( Navjot Sawhney )రిషి సునాక్ భార్య యూకే ప్రథమ మహిళ అక్షతా మూర్తి ఈ విందును హోస్ట్ చేశారు.
పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్ గ్రహీతలు, కమ్యూనిటీకి అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ఈ విందుకు రావాల్సిందిగా ఆహ్వానాలు వెళ్లాయి.
కాగా.నవజోత్ సాహ్నీ జీవితం స్పూర్తివంతం.నిరుపేదలకు తక్కువ ధరలో లభ్యమయ్యే వాషింగ్ మెషీన్‌లను ఆయన రూపొందించారు.
ఈ వాషింగ్ మెషిన్ ప్రాజెక్ట్‌కు సంబంధించి నవజోత్ గతంలో మాట్లాడుతూ.ఇది అల్పాదాయ వర్గాలకు ప్రయోజనకరంగా వుంటుందన్నారు.
దీని ద్వారా 60 నుంచి 70 శాతం సమయంతో పాటు 50 శాతం నీటిని ఆదా అవుతుందని నవజోత్ చెప్పారు.ఈ వాషింగ్ మెషిన్‌ల ఆలోచన ఓ స్నేహం నుంచి పుట్టిందట.
గ్రామీణ దక్షిణ భారతదేశంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఓ రోజున దివ్య అనే మహిళను నవజోత్ కలిశారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ మహిళలపై పడే భారాన్ని గుర్తించాడు.
యూకేలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత నవజోత్‌కు ఈ వాషింగ్ మెషీన్ల ఆలోచన వచ్చింది.
తమిళనాడులో వున్నప్పుడు తాను కుయిలపాలయం అనే చిన్న గ్రామంలో నివసించానని ఆయన చెప్పాడు.ఆ ప్రాంతంలో విద్యుత్ కోత వుండటం వల్ల రోజుకు రెండుసార్లు నీటికోసం మోటార్లు వేయాల్సి వుంటుందని తెలిపాడు.ఈ సమయంలోనే తన పక్కింటిలో నివసించే దివ్యతో స్నేహం కుదిరిందని నవజోత్ చెప్పాడు.
ఆమె ఎల్లప్పుడు బట్టలు ఉతకడంతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో పనిచేసేదని గుర్తుచేసుకున్నాడు.కలుషితమైన నీటితో బట్టలు ఉతకడం వల్ల ఎన్నో అంటువ్యాధులు సంక్రమించడంతో పాటు పలు రకాల అనారోగ్యాలకు గురయ్యే అవకాశం వుందని నవజోత్ తెలిపారు.
ఇది ఒక్క దివ్యకే కాకుండా ఎన్నో దేశాల్లో మహిళలకు భారంగా వుందని ఆయన అన్నారు.ఈ క్రమంలోనే లెబనాన్, ఫిలిప్పిన్స్, కామెరూన్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా 11 విభిన్న దేశాల్లో వున్న మహిళలతో, సంఘాలతో మాట్లాడినట్లు నవజోత్ పేర్కొన్నారు.ఆ సంఘాలలో మహిళలతో పాటు ఆరేళ్ల వయసున్న పిల్లలను కూడా కలుసుకున్నారు.ఇలాంటి పనులు వారి చదువుకే కాకుండా బాల్యానికి కూడా హానికరమని ఆయన అన్నారు.అలాగే వాషింగ్ మెషీన్‌లను డెలివరీ చేసేందుకు గాను 2021 ఆగస్టులో 10000 పౌండ్ల విరాళాలను సేకరించేందుకు గాను జస్ట్ గివింగ్‌లో క్రౌడ్ ఫండింగ్ అప్పీల్‌ను కూడా నవజోత్ చేశారు.