ప్రస్తుతం గుళ్లకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు.ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది.
ఈ నేపథ్యంలో ఆలయాలు భక్తులు లేక శోభ కోల్పోతున్నాయి.ఈ క్రమంలోనే ఒక హనుమాన్ మందిరం ఆలయ నిర్వాహకులు వినూత్న ఆలోచన చేసి భక్తులను ఆకట్టుకుంటున్నారు.
గుజరాత్‌లోని వడోదరలోని హార్ని ప్రాంతంలో ఉండే శ్రీ భిద్భంజన్ మారుతీ మందిర్ నిర్వాహకులు ఒక మెకానికల్ సిస్టం తీసుకొచ్చారు.దీంతో భక్తులు గర్భగుడిలోకి వెళ్లకుండానే హనుమంతుడికి నూనె అర్పించడం సాధ్యమవుతోంది.
ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా హనుమాన్ టెంపుల్ బయటనుంచే భక్తులు బటన్స్ నొక్కి స్వామివారికి నూనె సమర్పించవచ్చు.దీని గురించి తెలిసిన భక్తులు చాలామంది ఈ ఆలయానికి తరలి వస్తున్నారు.
గతంలో అన్ని శనివారాల్లో ఆలయానికి రెండు వేలమంది వచ్చేవారట.కానీ కరోనా వల్ల భక్తుల సంఖ్య 500కు తగ్గిపోయిందని ఆలయ నిర్వాహకులు అంటున్నారు.ఒమిక్రాన్ నేపథ్యంలోనూ భక్తులు వస్తున్నారు కానీ వారిని కరోనా నిబంధనలు ప్రకారం లోపలికి అనుమతించడం అసాధ్యంగా మారిందని అన్నారు.ఇలాంటి పరిస్థితుల మధ్య మెకానికల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని వివరించారు.
ఈ ఆలయ పూజారి మాట్లాడుతూ భక్తులు రూ.5 నుంచి రూ.50 విలువైన నూనెను దేవుడికి సమర్పించొచ్చని పేర్కొన్నారు.ఈ ఆటోమేటెడ్ మెకానికల్ మెషిన్ సాయంతో పూజారులకు, భక్తులకు మధ్య భౌతిక దూరం పాటించడం సాధ్యమవుతుందన్నారు.
అంతేకాదు ఒక్క బటన్ నొక్కితే చాలు ఆంజనేయ స్వామి విగ్రహం పై నూనె ఆటోమేటిక్ గా పడుతుంది.నూనె సమర్పించగానే దేవుని విగ్రహం మరింత కాంతివంతంగా మెరుస్తుంది.
అప్పుడు భక్తులు దేవుణ్ణి మరింత స్పష్టంగా దర్శించుకోవచ్చు.అయితే ఆలయం ఏర్పాటుచేసిన మెకానికల్ వ్యవస్థ పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హనుమంతుడికి నేరుగా నూనె సమర్పించకపోయినా సురక్షితంగా దూరం నుంచి సమర్పించడం సంతృప్తిగా ఉందని భక్త జనాలు చెబుతున్నారు.ప్రస్తుతం ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రాధాన్యత సంతరించుకుంటోంది.