ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీలో టిక్కెట్ల వ్యవహారం రచ్చ రచ్చగా మారింది.ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ,నియోజకవర్గ ఇన్చార్జీలను మార్చి వారి స్థానంలో కొత్తవారిని నియమించే కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.
ఈ వ్యవహారం ఆ పార్టీలో పెద్ద గందరగోళంగా మారింది.ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఏపీ ప్రధాన ప్రతిపక్షం టిడిపి కూడా టికెట్ల వ్యవహారంపై పూర్తిగా దృష్టి సారించింది.
వచ్చే ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను, నియోజకవర్గ ఇన్చార్జిలను నియమించి పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లాలని ఆ పార్టీ భావిస్తుంది.టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్ ను ఖరారు చేస్తున్నట్లుగా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారట.
ఇటీవల పార్టీ అంతర్గత సమావేశంలో చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేల వ్యవహారంపై చర్చించి వారికి మళ్ళీ టిక్కెట్లు ఇస్తున్నట్లు ప్రకటించారట.టిడిపి నుంచి 23 మంది ఎమ్మెల్యేలు 2019 ఎన్నికల్లో గెలవగా, వారిలో నలుగురు వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు.
మిగిలిన 19 మందికి టికెట్ కాయంగా తెలుస్తోంది.ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ఖరారు చేశారట.
ఇక రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపించకపోవడంతో ,బదులుగా ఆమె భర్త ఆదిరెడ్డి వాసు కు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారట.ఇక మరో ఎమ్మెల్యే గంటాశ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు.
దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగానే స్పందించారట. తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల చౌదరి నియోజకవర్గంలో కొంత సందిగ్ధత నెలకొంది.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గా బుచ్చయ్య చౌదరి ఉండగా.ఆ నియోజకవర్గం పై జనసేన కూడా ఆశలు పెట్టుకుంది.
పొత్తులో భాగంగా కచ్చితంగా రాజమండ్రి రూరల్ సీటును తమకు కేటాయించాల్సిందిగా జనసేన పట్టుబడుతోంద .దీంతో బుచ్చయ్య ను అక్కడ కొనసాగిస్తారా లేక మరో నియోజకవర్గం కేటాయిస్తారా అనేది తేలాల్సి ఉంది.అయితే ఎక్కడో ఒక చోట మాత్రం పోటీ చేయడం ఖాయంగానే పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున పోటీ చేసేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. అదే నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున ఆత్మకూరు లేదా సర్వేపల్లి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారట.రామనారాయణరెడ్డి ఆత్మకూరులో పోటీ చేస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి లో పోటీ చేసే అవకాశం ఉందట.
ఇక వైసిపి నుంచి టీడీపీ అనుబంధంగా కొనసాగుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవికి మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదట. ఈ మేరకు వారికి ప్రత్యామ్నాయంగా వేరే పదవులు ఇస్తామని హామీ ఇచ్చారట.
దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.