హైదరాబాద్ : జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు రెడీ అయిన గులాబీ పార్టీ. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నది.
అందులో భాగంగా ముఖ్యంగా మహారాష్ట్రపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది.అక్కడ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలు ఎక్కువగా ఉండటం తమకు కలిసి వస్తుందని గులాబీ బాస్ భావిస్తున్నారు.
దానికి తోడు శివసేన అంటే హిందుత్వ పార్టీ అనే భావన అక్కడి ప్రజల్లో ఉన్నది.ఇక దేశ వ్యాప్తంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ఇక్కడ బలపడే అవకాశాలు లేవనేది బీఆర్ఎస్ అభిప్రాయం.
మరో వైపు ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేయడంతో ఆ పార్టీలో సంక్షోభం మరింత పెరగనుంది.
ఈ పరిస్థితులన్నీ బీఆర్ఎస్కు అనుకూలంగా మారుతున్నాయని, యాంటీ బీజేపీ పార్టీగా తమ పార్టీకే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని గులాబీ బాస్ భావిస్తున్నారు.
అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి గెలవడం ద్వారా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పార్లమెంటుకు రాస్తా క్లియర్ అవుతుందని నమ్ముతున్నారు.తెలంగాణ గులాబీ పార్టీ బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న తర్వాత మహారాష్ట్రపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
ఇందుకు నిర్దిష్టమైన కారణాలే ఉన్నాయి.
యాంటీ బీజేపీ ఫోర్స్‌గా చెప్పుకుంటూ జాతీయ పార్టీగా ఎదగాలని బీఆర్ఎస్ ఆలోచిస్తున్న టైమ్‌లోనే మహారాష్ట్రను కార్యక్షేత్రంగా కేసీఆర్ ఎంచుకోవాలని భావించారు.
ఈ ఏడాదిన్నర సమయంలో ఆయన అంచనాలకు తగ్గట్టుగానే అక్కడి రాజకీయ పరిస్థితులు గులాబీ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.ఇతర రాష్ట్రాల కన్నా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ శూన్యత, అక్కడి పార్టీలకు ఉన్న బలహీనతలు, నిలదొక్కుకోవడానికి బీఆర్ఎస్కు ఉన్న అనుకూల పరిస్థితులు కేసీఆర్‌కు కలిసొచ్చేలా ఉన్నాయనే అభిప్రాయాలు వారి నుంచి వినిపిస్తున్నాయి.