తెలంగాణ కాంగ్రెస్లో సంక్షోభానికి రాష్ట్ర కాంగ్రెస్ అడ్వైజర్ దిగ్విజయ్ సింగ్ తెర దించారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు వచ్చిన డిగ్గీ రాజా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాల నేతలతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన దిగ్విజయ్ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ లేకుండా తెలంగాణ లేదని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు.తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు.
తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్న ఆయన అవినీతిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.అటు బీజేపీ పాలనలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
అమాయకుల మీద ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు చేస్తున్నారన్నారు.నిర్దోషుల మీద ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందన్న దిగ్విజయ్ సింగ్ సర్కార్ పై అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.అనంతరం కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా.
నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉంటే అంతర్గతంగా మాట్లాడండి అని కోరారు.నేతల మధ్య భేదాభిప్రాయలపై బహిర్గతంగా వ్యాఖ్యలు చేయొద్దని కోరారు.