యాదాద్రి జిల్లా: ఈ బడ్జెట్ సమావేశాల్లో బునాదిగానీ కాల్వకు అధిక నిధులు కేటాయించి అసంపూర్తిగా ఉన్న కాలువ పనులను వెంటనే పూర్తి చేసి నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు.ఆదివారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురంలో బొల్లేపల్లి స్వామి అధ్యక్షతన జరిగిన సిపిఎం గ్రామ శాఖ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ సిపిఎం, రైతాంగం,ఈ ప్రాంత ప్రజల అనేక పోరాటాల ఫలితంగా 2005లో ఆనాటి ప్రభుత్వం బునాదిగానే కాల్వకు శంకుస్థాపన చేయగా నేటికి 17 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కాలువ పనులు అసంపూర్తిగానే ఉన్నాయని నర్సింహ ఆవేదన వెలిబుచ్చారు.
మక్తఅనంతారం నుండి అడ్డగూడూరు మండలం ధర్మారం వరకు కాల్వతీసి మూసి జలాలను సాగునీటి కోసం రైతులకు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు తగిన నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు.కేవలం మక్తఅనంతారం నుంచి అనాజిపురం చెరువు వరకు నీళ్లు రావడానికి కాలువ తీశారు కానీ,ఆ కాలువ వెడల్పు,లోతు లేక సరిగా నీళ్లు రాక పోవడం,వస్తున్న నీళ్లు అక్కడక్కడా పొంగిపొర్లి పోవడం జరుగుతుందని అన్నారు.అనాజిపురం నుండి ధర్మారం వరకు కాలువ పనులు చేపట్టి పూర్తి చేసి నీళ్లు ఇచ్చే పరిస్థితి నేటికీ లేదని అన్నారు.17 సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్లో బునాదిగానీ కాల్వ పూర్తి కోసం నిధులు కేటాయిస్తారని,కాలువ పూర్తవుతుందని కళ్లు కాయలు కాచేలా విధంగా ఈ ప్రాంతం రైతాంగం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.నీళ్లు,నిధులు, నియామకాలు అని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చిన్న నీటి కాలువలకు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి పూర్తి చేయటం లేదని నర్సింహ ప్రశ్నించారు.బునాదిగానీ కాల్వలో భూములు కోల్పోయిన రైతులకు నేటికీ చాలామందికి డబ్బులు ఇవ్వలేదని,భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వడం లేదని అధికారులను ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించి బునాదిగానీ కాల్వ వెడల్పు,లోతు తీసి ధర్మారం వరకు సాగు నీరు అందించాలని,కాల్వలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పుడున్న మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.ఈ బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోతే ఈ ప్రాంత రైతాంగానికి సమీకరించి పోరాటాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ,మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదూరి మల్లేశం,సిపిఎం సీనియర్ నాయకులు గునుగుంట్ల శ్రీనివాస్,మండల పార్టీ మాజీ కార్యదర్శి బొల్లెపల్లి కుమార్,గ్రామ శాఖ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్,ఏరియా కార్యదర్శి ఏదునూరి వెంకటేష్,గ్రామ నాయకులు ఎండి.జహంగీర్,కడారి రాజమల్లు,కడారి కృష్ణ,బొల్లెపెల్లి స్వామి,వెంకట్ స్వామి,మహేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.