జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్రేజ్ అమాంతం పెరిగింది.రాజకీయంగానూ, సినిమా పరంగానూ ఇప్పుడు పవన్ ఫామ్ లోకి వస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.
ఆయన నటించిన భీమ్లా నాయక్ విజయం నమోదు చేసుకోవడం, అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ నమ్ముతూ ఉండడమే కాకుండా , ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తుండటం, పవన్ దృష్టిలో పడేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ జనసేన ఇమేజ్ ను మరింత పెంచుతున్నాయి.ప్రస్తుతం ఏపీలో బీజేపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కాకపోతే పొత్తు ఉన్నా, లేనట్టుగా రెండు పార్టీల మధ్య వ్యవహారం నడుస్తోంది.ఈ క్రమంలోనే బీజేపీతో పవన్ పొత్తు రద్దు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనతో పొత్తు కొనసాగించాలని , రాబోయే ఎన్నికలలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని కోరుకుంటోంది.దీనికి తగ్గట్లుగానే, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ పొగిడే ప్రయత్నం చేస్తున్నా, జనసేన నుంచి కానీ, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నుంచి కానీ, స్పందన అయితే కనిపించడం లేదు.
దీంతో బీజేపీ జనసేన మధ్య పొత్తు రద్దు అవుతుందని టిడిపి వంటి పార్టీలు బలంగా నమ్ముతున్నాయి.
పవన్ దృష్టిలో పడేందుకు, జనసేన తో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి తహతహలాడుతోంది.అందుకే అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ పవన్ కళ్యాణ్ ను పొగిడే ప్రయత్నం చేస్తోంది.నిన్న విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ విజయాన్ని ప్రస్తావిస్తూ నారా లోకేష్ వంటి వారు ట్విట్టర్ ద్వారా పవన్ ను పొగిడే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే పవన్ కూడా బీజేపీతో కలిసి రాజకీయ ప్రయాణం చేసినా తమకు పెద్దగా కలిసిరాదని, తమతో ఉంటే బీజేపీకి మాత్రమే లాభం చేకూరుతుందని నమ్ముతున్నారు.అయినా బీజేపీతో అధికారికంగా పొత్తు రద్దు చేసుకునే ఆలోచనలో పవన్ ఉన్నారట.
ఈ పరిణామాలు ఏపీ బీజేపీ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.