ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందింది.తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రజల్లో గుర్తింపు ఉన్నా, దానిని ఓట్ల రూపంలో మలుచుకోవడంలో విఫలమైంది.
దీనికి కారణం తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఐక్యత లేకపోవడం ఒకటైతే , పార్టీలో సీనియర్లు ఎక్కువగా ఉండడం, వారి మధ్య గ్రూపు రాజకీయాలు పెరగడం ఇవన్నీ కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి.దీంతో 2023 ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఏదో రకంగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ని నియమించింది.అలాగే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్యం ఠాకూర్ ను నియమించింది.
మొదట్లో ఠాకూర్ తెలంగాణ కాంగ్రెస్ లో తన ముద్ర పడే విధంగా కీలకంగా వ్యవహరించే వారు.
ఎక్కువగా తెలంగాణలో పర్యటిస్తూ సభలు , సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలోని కీలక నాయకులు అందరితోనూ ఎప్పుడూ టచ్ లో ఉండేవారు.
మాణిక్యం ఠాకూర్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జిగా వచ్చిన తర్వాత చెప్పుకోదగిన విజయాలు కాంగ్రెస్ కు దక్కకపోయినా, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం కలిగే విధంగా చేయడంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యారు.అయితే ఇప్పుడు మాత్రం మాణిక్యం ఠాకూర్ పేరు తెలంగాణ కాంగ్రెస్ లో పెద్దగా వినిపించడం లేదు.
పూర్తిగా సైలెంట్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నారు.తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో పెద్దగా ఆయన టచ్ లో ఉండకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే మాణిక్యం ఠాకూర్ సైలెంట్ అవ్వడానికి కారణాలు చాలా ఉన్నాయట.నిత్యం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య విభేదాలు రావడం, దానికి సంబంధించిన ఫిర్యాదులు ఠాకూర్ కు చేయడం ఎవరు వెనక్కి తగ్గేలా వ్యవహరించకపోవడం ఇవన్నీ నిత్యం తలనొప్పిగా మారాయట.
దీంతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల ఫోన్లు ఎత్తేందుకు కూడా భయపడే పరిస్థితి నెలకొన్నట్లు గా కాంగ్రెస్ వర్గాలే పేర్కొంటున్నాయి.
కాంగ్రెస్ అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న నాయకులు ఎవరూ ఠాకూర్ ను కూడా లెక్క చేసే పరిస్థితి లేకపోవడం వంటి వ్యవహారాలతో ఆయన సైలెంట్ అయ్యారట.గతంలోనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమించిన సమయంలో కాంగ్రెస్ సీనియర్లు మాణిక్యం ఠాకూర్ పైన విమర్శలు చేశారు. డబ్బుకు అమ్ముడుపోయి రేవంత్ కు పదవిని కట్టబెట్టేలా చేశారని, రేవంత్ పై అనేక ఫిర్యాదులు వస్తున్న అధిష్టానం వద్దకు తీసుకు వెళ్లడం లేదని విమర్శలు చేశారు.
మొదట్లో ఆ విమర్శలకు ఠాగూర్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చినా, కాంగ్రెస్ సీనియర్లు వెనక్కి తగ్గక పోవడం, తననే లెక్కచేయకపోవడం, రోజు రోజుకు తనకు తల నొప్పులు ఎక్కువ అవుతుండడంతో సైలెంట్ గా ఉండడమే బెటర్ అనే అభిప్రాయం లో ఠాగూర్ ఉన్నారట.