రియల్‌బోటిక్స్ ( Realbotics )అనే ఓ అమెరికన్ టెక్నాలజీ సంస్థ తాజాగా సంచలనం సృష్టించింది.‘ఏరియా’ (Aria) పేరుతో అత్యాధునికమైన కృత్రిమ మేధస్సు (AI) రోబోను రూపొందించింది.లాస్ వెగాస్‌లో జరిగిన 2025 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఈ రోబోను ప్రదర్శించగా, అందరూ ఆశ్చర్యపోయారు.మనుషుల్లాగే హావభావాలు పలికించే ఈ రోబో ధర అక్షరాలా రూ.1.5 కోట్లు లేదా 175,000 డాలర్లు.
రియల్‌బోటిక్స్ సీఈఓ ఆండ్రూ కిగెల్ ( CEO Andrew Kigel )ఈ రోబోను రూపొందించడానికి గల కారణాన్ని వెల్లడించారు.మనుషులకు ఏ మాత్రం తీసిపోని విధంగా రోబోలను తయారు చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.
ఒంటరితనం వంటి సమస్యలను పరిష్కరించడానికి, ఒక శృంగార భాగస్వామిగా కూడా ఈ రోబో ఉపయోగపడుతుందని కిగెల్ అభిప్రాయపడ్డారు.అంటే ఇది ఆ సుఖం కూడా అందిస్తుందట.
సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘హర్’ (Her) స్ఫూర్తితో ఈ రోబోను రూపొందించామని, ఇది మిమ్మల్ని గుర్తుంచుకుంటుందని, మీ లవర్ లేదా ప్రేమికురాలిలా ప్రవర్తిస్తుందని ఆయన చెప్పారు.ప్రపంచంలోనే అత్యంత సహజమైన రోబోల్లో ఏరియా ఒకటని, ముఖ్యంగా రూపంలో ఇది అద్భుతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మరింత మెరుగుపరచడంపై తమ సంస్థ దృష్టి సారించిందని కిగెల్ తెలిపారు.
ఎమోషన్స్ పలికించడంలో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా ముఖ్యమని ఆయన అన్నారు.టెస్లా వంటి కంపెనీలు నడిచే రోబోలపై పనిచేస్తుంటే, తాము మాత్రం ఎమోషన్స్, హావభావాలపై దృష్టి పెట్టామని ఆయన స్పష్టం చేశారు.
ఏరియా తన ఎక్స్ప్రెషన్స్ పలికిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.కొందరు దాని రూపాన్ని చూసి ఆశ్చర్యపోగా, మరికొందరు మాత్రం వింతగా ఉందని అభిప్రాయపడ్డారు.“ఇది నిజమైన మనిషి అనుకున్నాను.” అని కొందరు కామెంట్ చేస్తే, “ఇది చాలా భయానకంగా ఉంది” అని మరికొందరు వ్యాఖ్యానించారు.ఈ ప్రదర్శనలో ఏరియా అందరి దృష్టిని ఆకర్షించింది.
చాలా మంది ఆమెతో ఫొటోలు దిగారు, మాట్లాడారు.అర్థవంతమైన సంభాషణలు జరపడం, మానవ సంబంధాలను మరింత ఆనందదాయకంగా మార్చడమే తన లక్ష్యమని ఏరియా స్వయంగా చెప్పింది.
ఏరియా తన హావభావాలను మార్చుకోవడానికి RFID ట్యాగ్స్‌ను ఉపయోగిస్తుంది.తన శరీరానికి అమర్చిన ప్రోస్థెటిక్స్ ఆధారంగా తన రియాక్షన్లను కూడా మార్చుకోగలదు.
ఈ రోబో ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.