కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`.ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు.
విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది.మాస్ మహారాజా రవితేజ సగర్వ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది.ఈ సందర్భంగా హీరో విష్ణు విశాల్ మీడియాతో ముచ్చటించారు.
ఇండస్ట్రీలోని కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఈ మూవీ దర్శకుడు మను ఆనంద్ పరిచయమయ్యారు.ఆయన గౌతమ్ మీనన్ గారితో పని చేశారు.మొదటగా ఆయన ఓ యాక్షన్ పాక్డ్ స్టోరీని చెప్పారు.ఇంకా వేరే ఏదైనా ఉందా? అని అడిగాను.కథ మొత్తం రెడీ కాలేదు కానీ.లైన్ ఉందని అన్నాను.ఆ లైన్ చెప్పడంతో వెంటనే ఓకే చెప్పేశాను.అంత సున్నితమైన కథను ఒప్పుకుంటాను అని ఆయన అనుకోలేదు.
నేను ఓకే అని చెప్పడంతో ఆశ్చర్యపోయారు.మామూలుగా అయితే ఈ సినిమాను వేరే ఫ్రెండ్ నిర్మించాలి.
కానీ చివరకు నేనే నిర్మాతగా మారాను.
నేను క్రికెటర్‌ని.
మా నాన్న పోలీస్ ఆఫీసర్.ఎప్పుడూ ట్రాన్సఫర్ అవుతూనే ఉంటారు.
క్రికెట్ వల్ల నాకు సయ్యద్ మహ్మద్ ఎక్కువ దగ్గరయ్యారు.నేను ఎప్పుడూ మతాలు, కులాలు, ప్రాంతాలు అని చూడను.
వాటిపై నాకు నమ్మకం లేదు.మా ఇద్దరి మధ్య మతం ఎప్పుడూ రాలేదు.
కానీ సమాజంలో జరిగిన సంఘటనలు బాధను కలిగిస్తుంటాయి.ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా కొన్ని ఘటనలు నాకు గుర్తొచ్చాయి.
ఈ సినిమాలో ఎవ్వరినీ, ఏ మతాన్ని కూడా బాధపెట్టబోం.మతం కంటే మానవత్వమే గొప్పది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.
ఈ సినిమా కోసం మను ఆనంద్ చాలా రీసెర్చ్ చేశారు.నిజ జీవితంలో ఓ ముస్లిం అబ్బాయికి జరిగిన ఘటనలను కూడా ఉదాహరణగా చూపించారు.మతాన్ని ఆధారంగా చేసుకుని ఇలాంటి ఘటనలు ఎక్కడైనా, ఎవరికైనా జరగొచ్చు.ఈ సినిమాలో మాత్రం ఏ మతాన్ని కూడా కించపరిచేలా సన్నివేశాలు లేవు.
సెన్సార్ సమయంలోనూ రెండు మూడు పదాలకు మ్యూట్ చెప్పారు, కట్స్ కూడా చాలా తక్కువే సూచించారు.
నాకు గౌతమ్ మీనన్ సర్ అంటే చాలా ఇష్టం.
నేను ఆయన అభిమానిని.ఆయన యాక్టర్స్ నుంచి నటనను రాబట్టుకునే తీరు బాగుంటుంది.
వారణం ఆయిరాం (సూర్య సన్నాఫ్ కృష్ణన్) సినిమాలో సూర్యను చూపించిన విధానం నాలో ఎంతో స్పూర్తినిచ్చింది.ఎంతో చాలెంజింగ్ రోల్స్ చేయాలని అనుకున్నాను.
అరణ్య సినిమా కోసం చాలా కష్టపడ్డాను.ఎన్నో గాయాలయ్యాయి.
వారణం ఆయిరాం సినిమాయే నాకు స్పూర్తి.అలాంటి డైరెక్టర్ నా సినిమాలో, నా నిర్మాణంలో నటించారు.
ఆయన ఎంతో మంచి నటులు.
రాక్షసన్ సినిమాను తెలుగులో రిలీజ్ చేయమని నా భార్య జ్వాల అడిగారు.
కానీ నేను ఆ సినిమాకు నిర్మాతను కాను.ఈ చిత్రాన్ని చూసిన నా భార్య ‘నువ్వే నిర్మాత కదా? ఈ సారి మాత్రం తెలుగులో కచ్చితంగా రిలీజ్ చేయాల్సిందే’ అని అన్నారు.నా భార్య ఫ్రెండ్ రవితేజ గారి వద్ద పని చేస్తుంటారు.అలా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాం.నా స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుందని రవితేజ అన్నారు.ఇలాంటి సినిమాలు ఎలా సెలెక్ట్ చేసుకుంటావ్ అని అడిగారు.
నేను మీలా మాస్ హీరో అవ్వాలని అనుకుంటున్నాను అని చెబితే.నేను నీలా కంటెంట్ ఉన్న సినిమాలను చేయాలని అనుకుంటున్నాను అని అన్నారు.
ఈ మూవీ రఫ్ కట్ చూసి షూర్ షాట్ హిట్ అని అన్నారు.కొన్ని కరెక్షన్స్ చెప్పారు.
కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పారు.నా కెరీర్‌లో ఈ సినిమా హయ్యస్ట్ బిజినెస్ చేసింది.
తెలుగు ప్రేక్షకులు కమర్షియల్ సినిమాలు, కంటెంట్ సినిమాలను ఆదరిస్తారు.
నాకు రీమేక్స్ అంటే నచ్చవు.
ఒక్కసారి చూసిన సినిమాను మళ్లీ చేయాలంటే నచ్చదు.ఒరిజినల్ అనేది ఎప్పుడూ ఒరిజినలే.
రీమేక్ సినిమా కంటే నా ఒరిజినల్ సినిమా బాగుంటేనే సంతోషిస్తాను.అందుకే ఇలాంటి పోలికలు రావొద్దని నేను రీమేక్ చేయను.
నా సినిమాలు రీమేక్ అయినా చూడను.కానీ నేను క్రికెటర్ అవ్వడంతో జెర్సీ రీమేక్ చేశాను.
సినిమాను డాక్యుమెంటరీగా తీస్తే ఎవ్వరూ చూడరు.కమర్షియల్ పంథాలో చెప్పాలి.ఈ సినిమాలో డైలాగ్స్ మనసును తాకేలా ఉంటాయి.ప్రతీ పాత్ర, ప్రతీ డైలాగ్‌కు ఎంతో ఇంపార్టెంట్ ఉంటుంది.
మేం ఏం చెప్పదలుచుకున్నామో అది అందరికీ సులభంగా అర్థమవుతుంది.
కరోనా తరువాత జనాలు ఇంకా ఇంటెలిజెంట్ అయ్యారు.
ఓటీటీలో అన్ని రకాల సినిమాలు చూసేశారు.వారిని ఎంటర్టైన్ చేయాలంటే ఏదో ఒక సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలి.
టైటిల్ నుంచి కూడా ఏదో ఒక కొత్తదనాన్ని ఆశిస్తుంటారు.అందుకే ఈ సినిమా టైటిల్‌ను FIR అని పెట్టాం.
ఆ టైటిల్ మీనింగ్ ఏంటన్నది ఇప్పుడు చెప్పలేను.సినిమా చూశాక అర్థమవుతుంది.
పాటల కంటే ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుంది.ఈ సినిమాకు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్.సినిమా సెకండాఫ్ మొత్తం కూడా యాక్షన్ పార్ట్ ఉంటుంది.దానికి తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చారు.
ట్రైలర్ చూసి చాలా మంది బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను మెచ్చుకున్నారు.ప్రయాణం పాట పెద్ద హిట్ అవుతుంది.
ప్రతీ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది.ఏ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు.పాత మొహాలే ఉంటే.తరువాత ఏం జరగుతుందో ఊహించేస్తారు.
అందుకే ఈ సినిమాకు చాలా మంది కొత్త వారిని తీసుకున్నాం.
నా కెరీర్‌లో రాక్షసన్ కంటే ముందు హిట్లున్నాయి.
రాక్షసన్ మాత్రం నా మార్కెట్‌ను పెంచేసింది.ఈ సినిమా తరువాత చాలా ప్రాజెక్ట్‌లు వచ్చాయి.
పెద్ద బ్యానర్లు, మంచి డైరెక్టర్లతో సినిమాలు ఓకే అయ్యాయి.మధ్యలోనే కొన్ని కారణాల వల్ల ఆగిపోయాయి.
నాకు ఇలా జరగడం ఏంటి? అనే కోపంతోనే నిర్మాతగా మారాలని అనుకున్నాను.అలా ఈ సినిమాను నిర్మించాను.
కరోనా వల్ల సినిమా ఆలస్యమవుతూ వచ్చింది.సెకండ్ వేవ్ సమయంలో కాస్త ఒత్తిడికి గురయ్యాను.
ఓటీటీకి ఇచ్చేయాలా? అని ఆలోచించాను.థియేట్రికల్ కలెక్షన్స్ బట్టే మార్కెట్ ఉంటుంది కాబట్టి థియేటర్లోనే విడుదల చేయాలని అనుకున్నాను.
సినిమాను చూసిన ఫ్రెండ్స్, ఇతర హీరోలు, ఓటీటీ సంస్థలు ఇలా అందరూ కూడా థియేటర్లోనే విడుదల చేయండి అని అన్నారు.
చివరి సమయంలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశాం.
ముందుగా మేలో ఈ సినిమాను విడుదల చేద్దామని అనుకున్నాం.కానీ ఫిబ్రవరిలో డేట్ దొరికింది.
అప్పటికి ఇంకా తెలుగు వర్షన్ కంప్లీట్ అవ్వలేదు.సెన్సార్ కాలేదు.
దాంతో ఆరేడు రోజులు మా టీం అంతా నిద్రపోకుండా కష్టపడ్డాం.