ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే.మూడు రోజుల పర్యటనలో భాగంగా సెప్టెంబర్ చివరి వారంలో ఆయన అమెరికా వెళుతున్నారు.
జో బైడెన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత అమెరికాలో మోడీ చేస్తున్న మొదటి పర్యటన ఇదే.ఈ పర్యటనలో మోడీ .బైడెన్‌తో తొలిసారి వ్యక్తిగతంగా సమావేశం కానున్నారు.వాస్తవానికి ఇద్దరు నేతలు అనేక సమావేశాల సందర్భంగా కలుసుకున్నారు.
మార్చిలో క్వాడ్ శిఖరాగ్ర సమావేశం, ఏప్రిల్‌లో వాతావరణ మార్పు శిఖరాగ్ర సమావేశం, ఈ ఏడాది జూన్‌లో జరిగిన జి -7 సమావేశాలలో ఇరువురూ పాల్గొన్నారు.
ఇక తాజా పర్యటనలో జో బైడెన్ ఆతిథ్యంలో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సులో మోడీ పాల్గొననున్నారు.
అలాగే అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్, ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌తోనూ మోడీ సమావేశం కానున్నట్లు సమాచారం.అధికారిక సమాచారం ప్రకారం.
సెప్టెంబర్ 22న న్యూఢిల్లీ నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్‌కు మోడీ చేరుకుంటారు.మరుసటిరోజు అక్కడి సీఈఓలతో సమావేశం కానున్నారు.
వారిలో టిమ్ కుక్ కూడా ఉండనున్నట్లు జాతీయ వార్తాపత్రిక వెల్లడించింది.అలాగే కమలా హారిస్‌తోనూ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
అదే రోజు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషియిడే సుగాతోనూ మోడీ సమావేశం కానున్నారు.
ఇదిలా ఉండగా.
మోడీ, బైడెన్ మధ్య ఆఫ్గనిస్థాన్ పరిణామాలు, కొవిడ్-19, వాతావరణ మార్పులు, ఇండో-పసిఫిక్, ఉగ్రవాదం వంటి పలు అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం.అలాగే పర్యటనలో చివరి రోజున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మోడీ ప్రసంగించనున్నారు.మార్చిలో బంగ్లాదేశ్ పర్యటన తర్వాత ఈ ఆరు నెలల వ్యవధిలో ప్రధాని మోడీ చేస్తున్న తొలి అంతర్జాతీయ పర్యటన ఇదే.2019 లో హ్యూస్టన్ నగరంలో జరిగిన మెగా డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ చివరిసారిగా అమెరికాకు వెళ్లారు.‘హౌడీ, మోడీ!’ అంటూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా హాజరయ్యారు.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోని ఏ దేశాధినేత కూడా వ్యక్తిగత లేదా.అధికారిక పర్యటనల నిమిత్తం మరో దేశానికి వెళ్ళడానికి అంత ఆసక్తి చూపించడం లేదు.అయితే భారత్‌కు పొరుగున్న వున్న ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలన ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న అంశం.
అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు తమ బలగాలను ఉపసంహరించుకోవడంతో ఆఫ్ఘాన్ లో తాలిబన్లు అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.ఆఫ్ఘాన్ విషయంలో మొదటి నుంచి అమెరికా వైఖరిని భారత్ సమర్ధిస్తూ వస్తోంది.
తాలిబన్ ఉగ్రవాద ప్రభుత్వాన్ని సమర్ధించే విషయంలో ఇప్పటి వరకు భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.ఈ నేపధ్యంలో అమెరికాలో మోడీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.