ఇంకేముంది హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపిస్తూ, తమ ప్రధాన ప్రత్యర్థి అయిన ఈటల రాజేందర్ ను ఓడచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుండటం, పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు ఈ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడం, గడపగడపకు టిఆర్ఎస్ పార్టీని తీసుకువెళ్లాలనే లక్ష్యంతో కెసిఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తూ ఉండడం, ఈ పరిణామాలన్నీ చూసి కెసిఆర్ కు ఎన్నికల పై చాలా తొందరే ఉంది అనే విధంగా అందరిలోనూ అభిప్రాయం కలిగింది.దీనికి తగ్గట్టుగానే నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఈ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి శక్తివంచన లేకుండా కృషి చేస్తూ వస్తున్నారు.
అయితే తెలంగాణలో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు అనువైన సమయం లేదని, భారీ వర్షాలు, పెద్ద ఎత్తున పండుగ సెలవులు ఉన్నాయని, ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి కెసిఆర్ విజ్ఞప్తి చేయడం, తదితర కారణాలతో హుజురాబాద్ ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
అయితే ఎన్నికలను వాయిదా వేయించాలి అనే నిర్ణయం కెసిఆర్ ఆషామాషీగా తీసుకోలేదని, వివిధ సర్వేలు, ఇంటిలిజెన్స్ సర్వేల రిజల్ట్ చూసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని అందరికీ అర్థమైంది.
అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలు వాయిదా పడడం పై విపక్ష పార్టీల అభిప్రాయం ఎలా ఉన్నా, టిఆర్ఎస్ లో మాత్రం ఈ వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతోంది.హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ చాలామంది నేతలకి కీలక పదవి ఇస్తాననే హామీ ఇచ్చారు.
అనేక మందికి ఎమ్మెల్సీ హామీలు ఇచ్చారు.ఇతర పార్టీల నుంచి భారీగా నేతలను చేర్చుకున్నారు.అయితే ఇప్పుడు ఉప ఎన్నికలు వాయిదా పడడంతో, వారంతా తమ పరిస్థితి ఏంటని లబోదిబోమంటున్నారు.హుజురాబాద్ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరిస్తున్న పాడి కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
అలాగే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలో కోటి రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు.
అలాగే సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి రెన్యూవల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక మాజీ స్పీకర్ మధుసూధనాచారి, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బొంతు రామ్మోహన్, టిడిపి తెలంగాణ అధ్యక్షుడు గా పనిచేస్తూ, టిఆర్ఎస్ లో చేరిన ఎల్ రమణ, దేశపతి శ్రీనివాస్, ఇలా చెప్పుకుంటూ వెళితే, చాలా మంది నాయకులకు కేసీఆర్ కీలక పదవుల పై హామీ ఇచ్చారు.ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడడంతో కేసీఆర్ తమను పక్కనపెట్టేస్తారు అని వీరంతా నానా హైరానా పడిపోతున్నారట.