సినిమాలు చాలా సందర్భాలలో మంచి పనులకి మాత్రమే కాకుండా చెడ్డ పనులకి కూడా స్ఫూర్తిని ఇస్తాయి.దర్శకులు ఏదో కొత్తగా ఆలోచించి క్రియేటివిటీతో రాసుకున్న సన్నివేశాలని కొంత మంది నిజ జీవితంలో స్ఫూర్తిగా తీసుకొని వాటిని అనుసరించి తప్పుడు పనులు చేస్తారు.
అయితే సినిమాలు అలాంటి పనులు చేసేది హీరో అయితే అతను ఈజీగా తప్పించుకుంటాడు.అయితే నిజ జీవితంలో తప్పులు చేసేవాళ్ళు ఎప్పటికి హీరోలు కాలేరు కాబట్టి చాలా ఈజీగా దొరికేస్తూ ఉంటారు.
ఎక్కువగా క్రైమ్ యాక్టివిటీస్ కి నేరగాళ్ళు సినిమాలని స్పూర్తిగా తీసుకోవడం జరుగుతుంది.భద్రమ్ అనే సినిమా చూసి తెలంగాణలో కొంత మంది ఇన్సురెన్స్ ఏజెంట్స్ గ్యాంగ్ గా ఏర్పడి హత్యలు చేసి చివరికి కటకటాల పాలయ్యారు.
అలాగే కొంత మంది హత్యలు కూడా అలాగే సినిమాల తరహాలో చేసి జైలు ఊచలు లెక్కపెడుతున్నారు.తాజాగా అక్షయ్ కుమార్ స్పెషల్ చబ్బీస్ సినిమా తరహాలో కొంత మంది కేటుగాళ్ళు తాము సీబీఐ అధికారులమని చెప్పుకొని ఓ డాక్టర్ ని దోపిడీ చేసేశారు.
ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఢిల్లీలోని పితాంపుర ప్రాంతానికి చెందిన ఓ డాక్టరు దగ్గరకి తాము సీబీఐ అధికారులమంటూ ఓ ఐదు మంది గ్యాంగ్ మంచిగా వచ్చారు.
కుటుంబ సభ్యుల ఫోన్లు లాగేసి బ్లాక్ మనీ ఎక్కడ అంటూ హంగామా చేశారు.లెక్కలు చూడాలంటూ బెడ్ రూమ్ బీరువా అన్నీ గాలించి మొత్తం 36 లక్షల డబ్బు బయటకు తీశారు.
బంగారం కూడా నిలువుదోపిడీ చేశారు.అంతా సర్దుకొని మీ ఆసుపత్రిలో కూడా సోదాలు చేయాలి పదా అంటూ ముందుకు కదిలారు.
డాక్టరు కారులోనే ఎక్కేసి అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు.డాక్టర్ కి ముందునుంచే డౌట్ గా ఉండటంతో కారు మౌర్య ఎన్ క్లేవ్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగానే బ్రేక్ వేసి పోలీస్ అంటూ కేకలు వేశాడు.
పోలీసులు వెంటనే వచ్చి కారులో ఉన్న ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు.వారిని వేరొక కారులో ఫాలో అవుతున్న ఇద్దరు అది గమనించి జంప్ అయిపోయారు.
ఆ ముగ్గురిని విచారించగా అక్షయ్ కుమార్ స్పెషల్26 చూసి ఈ స్కెచ్ గీసినట్టు చెప్పారు.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరికోసం గాలింపు చేపట్టారు.