ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి వైసీపీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు.ఎంపిటిసి , జెడ్పిటిసి ఎన్నికల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న వైసీపీ రేపోమాపో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని ఆశగా ఎదురు చూస్తోంది.
ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవడంతో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లోనూ అదే స్థాయిలో సత్తా చాటుకుని , తమకు తిరుగులేదని నిరూపించుకునేందుకు చూసింది.కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం తాను ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వలేను అని, తాను ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నానని, ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశమే లేదని క్లారిటీ గా చెప్పేశారు.
దీంతో వైసిపి నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ విషయాన్ని క్లారిటీగా చెప్పారు.జెడ్పి, ఎంపిటిసి ఎన్నికలపై ఏకగ్రీవాలు జరిగినచోట ఫిర్యాదు చేయవచ్చు అని, రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందన్నారు.దౌర్జన్యం, బెదిరింపులు, ప్రలోభాలు కారణంగా నామినేషన్లు వేయలేకపోయిన వారు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని, రిటర్నింగ్ అధికారులు దీనిపై విచారణ చేస్తారని నిమ్మగడ్డ చెప్పారు.
ఇప్పటికే వైసీపీ ప్రభుత్వానికి అనేక రకాలుగా ఇబ్బందులు సృష్టిస్తూ వచ్చిన నిమ్మగడ్డ ఇప్పుడు మరోసారి ఈ విధమైన ఈ ప్రకటనతో పార్టీ నేతల్లో గందరగోళం సృష్టించారు.ఇప్పటికే నిమ్మగడ్డ హైకోర్ట్ ద్వారా ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలకు నోటీసులు ఇప్పించిన సంగతి తెలిసిందే.తాను గవర్నర్ కు రాసిన లేఖలు బయటకు లీక్ అయిన ఘటనపై పిటిషన్ వేసిన నిమ్మగడ్డ ఇప్పుడు ఈ విధంగా షాక్ ఇచ్చారు.ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కొత్త ఎన్నికల కమిషనర్ గా పాత చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నిని ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.