ఏపీ రాజధాని అంశం ఇప్పటికీ , ఎప్పటికీ ఒక క్లారిటీ లేని,ఒక పరిష్కారం లేని అంశంగా మారిపోయింది.రెండు పార్టీల మధ్య పోరు కారణంగా ఏపీ రాజధాని అనే అంశం పెద్ద చిక్కుముడిగానే మారిపోయింది.
ఏపీ, తెలంగాణ విభజన తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది.ఆ తర్వాత కొద్ది నెలలకు ఏపీ రాజధానిగా అమరావతి ని ప్రకటించడం, అక్కడ రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్లడం, ఇక ప్రజలు సైతం అమరావాతే ఏపీ రాజధాని అని ఫిక్స్ అయిపోవడం, ఇలా ఎన్నో జరిగిపోయాయి.
కానీ 2019 ఎన్నికల్లో అధికారం దక్కించుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎవరూ ఊహించని విధంగా అమరావతి అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది.
ఏపీ లో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పరిపాలన వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో, జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను చేశారు.
అలా చేయడమే ఆలస్యం, విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుకు జగన్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ వచ్చారు.ఈ సమయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, వెనక్కి తగ్గేలా జగన్ కనిపించలేదు.
గత ఏడాది జనవరిలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించడంతో పాటు, గవర్నర్ తో ప్రత్యేక సంతకాలు చేయించి పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను చట్ట రూపంలోకి తెచ్చారు.అయితే ఇక్కడే న్యాయపరమైన వివాదాలు ఏర్పడడంతో, ఈ వ్యవహారం రోజు రోజుకు మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

అయితే అనధికారికంగా విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేసేందుకు జగన్ లక్ష్యం పెట్టుకున్నా, అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.ఇప్పటికే దీనిపై వందకుపైగా పిటిషన్లు వేయడం, న్యాయస్థానాల్లో విచారణ చేయాల్సి ఉండడం వంటి కారణాలతో అమరావతి వ్యవహారంపై అనేక చిక్కుముడులు ఏర్పడ్డాయి.కోర్టుల్లో ఈ వ్యవహారం పరిష్కారం అయ్యే వరకూ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి తప్ప విశాఖకు తరలించే అవకాశం లేకపోవడం, ఇలా ఎన్నో కారణాలతో, జగన్ నిర్ణయం వాయిదాల మీద వాయిదాలు పడుతు వస్తోంది.జగన్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా , అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడంలేదు.